ఆ సినిమాను పక్కనబెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడోచ్చు కదా!

 

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకి వేర్వేరు ఆశయాలు, సిద్దాంతాలు, పార్టీలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో వారిరువురు ఒకేలా వ్యవహరిస్తుంటారు. ఇద్దరూ కూడా ఎన్నికల ముందే రాజకీయపార్టీలు పెట్టారు. కాకపోతే చిరంజీవి తన అభిమానుల అండదండలతో డైరెక్టుగా ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగంటూ తన రాజ్యాన్ని స్థాపిస్తే, అసలు తనకు రాజ్యమూ వద్దు...అధికారమూ వద్దు...జస్ట్ ప్రశ్నించడానికే కనబడని సైన్యాన్ని వెంటేసుకొచ్చానని చెప్పుకొన్నాడు బ్రదర్ పవన్ కళ్యాణ్. కానీ, ఆ ఇద్దరు  బ్రదర్స్ తమ రాజ్యాన్ని, సైన్యాన్ని వేర్వేరు పార్టీలలో కలిపేసి ఎన్నికలయిపోగానే మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోయారు. ఇద్దరూ కూడా ఖాళీ ఉన్నప్పుడు రాజకీయాలు, రాష్ట్రోద్దారణ గురించి మాట్లాడుతుంటారు.

 

మొన్న ఆ మధ్యనెప్పుడో సడన్ గా మెలకువ వచ్చినప్పుడు పవన్ బాబు ప్రత్యేక హోదా గురించి ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి వెళ్లిపోయారు. ఈరోజు మెగా బ్రదర్ చిరంజీవి కూడా ప్రత్యేక హోదా గురించి అధికార తెదేపాని మీరేం చేస్తున్నారు అంటూ నిలదీశారు. గత పదేళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశ వ్యాప్తంగా అనేక వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నప్పుడు నోరు మెదపని ఆయన ఇప్పుడు రైతులకు భరోసా కల్పించేందుకే రాహుల్ గాంధీ శ్రమ అనుకోకుండా పాదయాత్రలు చేస్తున్నారని వెనకేసుకు వచ్చేరు.

 

రాష్ట్ర విభజన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆయనకీ తెలుసు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదాలను చూస్తూనే ఉన్నారు. కానీ వాటి గురించి మాట్లాడకుండా తమ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ దానిని కేంద్రం అమలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని తెగ ఆవేదన పడిపోయారు. కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయనే స్వయంగా రాజ్యసభకి వెళ్లి కేంద్రాన్ని నిలదీయకుండా తన 150 సినిమా గురించి మాత్రమే ఎందుకు ఆలోచిస్తున్నారో ఆయనకే తెలియాలి.