ఎంత పనిచేశావు గోపాలా?
posted on: Mar 6, 2015 7:39PM
.jpg)
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నదమ్ములిరువురూ సినీ రంగంలో ఎంత గొప్ప పేరు సంపాదించుకొన్నారో, రాజకీయాలలో చేరిన తరువాత అంత అప్రదిష్టపాలయ్యారు. చిరంజీవి రాజకీయ ప్రస్తానం గురించి అందరికీ తెలిసిందే గనుక మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకొనవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ నిన్న తుళ్ళూరులో పర్యటించినపుడు ఒకలాగా, హైదరాబాద్ తిరిగి రాగానే మరొకలా మాట్లాడి అభాసుపాలయ్యారని చెప్పక తప్పదు. అసలు ఇన్ని రోజులు మౌనంగా కూర్చొని ఆయన ఇప్పుడు ఇంత హటాత్తుగా తుళ్ళూరు పర్యటనకు ఎందుకు బయలుదేరారో, వెళ్లి వచ్చిన తరువాత మళ్ళీ అక్కడి ప్రజలు పిలిచినందునే వెళ్లాను...ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్దేశ్యం లేదని మళ్ళీ ఎందుకు అన్నారో తెలియదు కానీ పొంతనలేని మాటలు మాట్లాడి తన రాజకీయ అపరిపక్వతను మరొకమారు బయటపెట్టుకొని అభాసుపాలయ్యారు.
ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ విశ్లేషకులు ఆయన పర్యటన వెనుక మర్మం ఏమిటి? ఎవరి ప్రోద్బలంతో పర్యటనకు బయలుదేరారు? అంటూ అన్ని కోణాలలో నుండి చేసిన విశ్లేషణల వలన రాజకీయ వర్గాలలో మరింత చులకనయ్యారు. పైగా ఒకపక్క పార్టీ నిర్మాణం చేసుకోలేదని ఒప్పుకొంటూనే త్వరలో జరుగబోయే జి.హెచ్.యం.సి. లేదా ఉపఎన్నికలలో తన పార్టీ పోటీ చేయవచ్చని చెప్పుకోవడం హాస్యాస్పదం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇరువురూ రాజకీయాలలో రాణించలేరనే సంగతి కళ్ళకు కట్టినట్లు కనబడుతూనే ఉంది. కానీ వారిరువురూ ఇంకా రాజకీయాలకు అంటిపెట్టుకొని ఉండేందుకు ప్రయత్నిస్తుండటం వలన అభాసుపాలవుతున్నారని చెప్పవచ్చును.
రాజకీయలలో తల బొప్పి కట్టిన చిరంజీవి మెల్లగా మళ్ళీ సినీరంగం వైపు అడుగులు వేస్తుంటే, పవన్ కళ్యాణ్ తన కెరీర్ పతాక స్థాయికి చేరుకొన్న ఈ సమయంలో సినీరంగాన్ని వదిలిపెట్టి తనకు ఏమాత్రం అనుభవం లేని రాజకీయాల వైపు తప్పటడుగులు వేస్తున్నారు. జీవితంలో అత్యంత అమూల్యమయిన సమయంలో ఇటువంటి ప్రయోగాలు చేయడంకంటే తమ పరిధిలో సామాజికసేవ చేసినా అదే స్థాయి సంతృప్తి పొందవచ్చును.



.jpg)
.jpg)


.webp)


