మెగా వాయిస్ తో ఆది శంకారాచార్య
posted on Feb 25, 2013 8:25PM
.jpg)
మన మెగా స్టారువారు తనకు జీవితాన్నిచ్చిన సినీ పరిశ్రమను వదిలిపెట్టి, రాజకీయాలలోకి ఎందుకు జమ్పింగు తీసుకొన్నారో అందరికీ తెలిసిన విషయమే. అయితే, సినీ పరిశ్రమలో స్వయం కృషితో రుద్రవీణ మోగించి పైకి వచ్చిన మన శంకర్ దాదా, రాజకీయాలలో కూడా ఓనామాల స్థాయి నుండి కేంద్ర మంత్రి పదవి చేపట్టి ఏకంగా యంబీబీయస్ పరీక్షలు పాసయిపోయాడు. అయినప్పటికీ, అతను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి ఇంకా చాల మెట్లు ఎక్కవలసి ఉంది. అందువల్ల అప్పుడప్పుడు ఆయన మనసు తాను ఏకచాత్రదిపత్యంగా ఏలిన సినీపరిశ్రమ వైపు లాగుతుంది.
సెంచరీకి చేరువలో ఉండగా చేతులెత్తేసే సచిన్ టెండూల్కర్ లాగ 149 సినిమాలు చేసి సినీ పరిశ్రమ నుండి తప్పుకోవడంతో ఆ ఒక్క చిత్రం కోసం ఆయన అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆయనకీ ఆ ఒక్కటీ చేసేసి రికార్డు సర్దుకోవాలని ఉంది కానీ, రాజకీయ వ్యవహారాలతో వీలు కుదరడంలేదు.
అయితే, ఇటీవల దొరికిన ఒక మంచి అవకాశాన్ని మాత్రం ఆయన సద్వినియోగపరుచుకొన్నాడు. దర్శకుడిగా మారిన సినీ రచయిత జేకే భారవి దర్శకత్వంలో గ్లోబల్ సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నఆధ్యాత్మిక చిత్రం ‘ఆది శంకరాచార్య’ సినిమాలో ఆ పాత్ర పోషిస్తున్న కౌశిక్ అనే కొత్త నటుడికి చిరంజీవి తన గొంతు అరువిస్తున్నాడు.
శంకరాచార్యకు వాయిస్ ఓవర్ గా వినిపించే చిరంజీవి అతని అభిమానులకి తెరపై మాత్రం ప్రత్యక్షంగా కనబడకపోయినా వినబడతాడు గనుక అతని అభిమానులు ‘మరేం చేస్తాం? అదే ఓ తుత్తి!’ అనుకొంటూ ఆయన గొంతు వింటూ సినిమా చూసేయక తప్పదు. ఈ సినిమాలో నాగార్జున, మోహన్ బాబు, నాగబాబు, శ్రీహరి మొదలయినవారు అతిధి పాత్రల్లో నటిస్తున్నారు.