Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దంతాల్లో చిప్...ఖమేనీ హత్యకు ఏడాదిగా పక్కా ప్లాన్..!
posted on: Mar 6, 2026 2:00PM

ఒక దేశ అత్యున్నత నేత ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఆయన వెంట ఎవరున్నారు? వంటి వివరాలు తెలుసుకోవడం సాధారణంగా చాలా కష్టమైన పని. ముఖ్యంగా యుద్ధ పరిస్థితుల్లో, ప్రాణాలకు ముప్పు ఉందన్న హెచ్చరికలు ఉన్నప్పుడు ఇది మరింత క్లిష్టంగా మారుతుంది. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్‌లో అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు సీఐఏ, మొస్సాద్‌లు అత్యంత పద్ధతిగా పని చేశాయన్న ప్రచారం జరుగుతోంది.
ఖమేనీని హతమార్చడం వెనుక ఒక్కరోజు లేదా ఒక్కసారిగా చేసిన ప్రయత్నం కాదని తెలుస్తోంది. ఈ ఆపరేషన్ కోసం నిఘా వర్గాలు ఏళ్ల తరబడి సేకరించిన సమాచారమే కీలకమైందని విశ్లేషకులు అంటున్నారు. 86 ఏళ్ల ఖమేనీ కదలికలను నిశితంగా గమనిస్తూ, సరైన సమయం కోసం చాలా కాలం పాటు వేచి చూసిన తర్వాతే దాడి జరిగిందని వివిధ నివేదికలు పేర్కొంటున్నాయి.ఖమేనీ హత్యకు సంబంధించి పలు సిద్ధాంతాలు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నాయి. వాటిలో డెంటల్ చిప్ ట్రాకింగ్ విధానం ఒకటిగా చెప్పబడుతోంది. ఈ విధానం ప్రకారం దంత చికిత్స సమయంలో రహస్యంగా ట్రాకింగ్ పరికరాలను అమర్చడం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రచారం ప్రకారం, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ తమ అనుబంధ వైద్యులు, దంత వైద్యులను ఏళ్ల కిందటే ఇరాన్‌లో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. ముఖ్యంగా సైనికులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసి, చికిత్స సమయంలో దంత ఇంప్లాంట్‌లలో సూక్ష్మ ట్రాకింగ్ చిప్‌లు అమర్చినట్టు సమాచారం. అలాగే వైద్య శిబిరాల పేరుతో కూడా దంత చికిత్సలు నిర్వహిస్తూ పరికరాలు అమర్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదే విధంగా కొంతమంది వైద్యుల ద్వారా కీలక అధికారుల శస్త్రచికిత్సల సమయంలో కడుపులోనూ ట్రాకింగ్ పరికరాలు అమర్చినట్టు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.ఇంకొక వాదన ప్రకారం, ఇరాన్‌లో కోటి మందికి పైగా వినియోగించే ప్రార్థనా సమయాల యాప్‌ను కూడా ఇజ్రాయెల్ నిఘా సంస్థలు హ్యాక్ చేశాయనే ప్రచారం ఉంది. అదేవిధంగా పలు వెబ్‌సైట్లు, యాప్‌లను కూడా హ్యాక్ చేసి సమాచారాన్ని సేకరించారన్న వార్తలు వెలువడుతున్నాయి.
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్
ఇరాన్‌లో పరిస్థితులను గమనించేందుకు అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చాలా కాలం క్రితమే ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేశాయన్న కథనాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా రాజధాని టెహ్రాన్‌లోని ట్రాఫిక్ కెమెరాల ద్వారా కీలక నేతల కదలికలను పర్యవేక్షించారన్న ప్రచారం ఉంది.ఈ వ్యవస్థ ద్వారా ఖమేనీ ఎక్కడికి వెళ్తున్నారు, ఎంతసేపు అక్కడ ఉంటున్నారు, ఆయన వెంట ఎవరున్నారు వంటి వివరాలను నిఘా వర్గాలు రియల్ టైమ్‌లో గమనించగలిగాయని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
ప్రత్యేకంగా ఖమేనీ తరచూ సంచరించే పాశ్చర్ వీధి పరిసరాల్లో నిఘా మరింత పెంచినట్టు చెబుతున్నారు. ట్రాఫిక్ డేటాను విశ్లేషించడం ద్వారా ఆయన కార్యాలయానికి ఎప్పుడు వస్తారు, ఆయనతో పాటు ఎవరుంటారు వంటి వివరాలను ముందుగానే గుర్తించారని నివేదికలు పేర్కొంటున్నాయి.అలాగే ఖమేనీ భద్రతా సిబ్బంది వాహనాల కదలికలు, వారు ఎక్కడ ఆగుతున్నారు.
ఎక్కడ భోజనం చేస్తున్నారు వంటి వివరాలు కూడా నిఘా వ్యవస్థల ద్వారా తెలుసుకునే ప్రయత్నం జరిగినట్టు సమాచారం. పాశ్చర్ వీధి సమీపంలోని కొన్ని మొబైల్ టవర్లపై కూడా దాడులు జరిగి కమ్యూనికేషన్ వ్యవస్థను దెబ్బతీశారని కొన్ని నివేదికలు వెల్లడించాయి. దీంతో హెచ్చరికలు సమయానికి చేరకుండా చేసే ప్రయత్నం జరిగిందని చెబుతున్నారు.అయితే ఈ అంశాలన్నింటిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ప్రస్తుతం ఇవన్నీ అంతర్జాతీయ మీడియా కథనాలు, విశ్లేషణల్లో వినిపిస్తున్న వాదనలుగానే ఉన్నాయి.






