చైనాలో 11 మంది మాఫియా మెంబర్స్‌కు ఉరి

posted on: Jan 29, 2026 6:31PM

 

చైనా సరిహద్దు ప్రాంతాలను వణికించిన ప్రసిద్ధ 'మింగ్ మాఫియా' ముఠా కథ ఎట్టకేలకు ముగిసింది. హత్యానేరాలు, అక్రమ నిర్బంధాలు, భారీ గ్యాంబ్లింగ్ వంటి సుమారు 14 రకాల క్రూరమైన నేరాలకు పాల్పడిన ఈ ముఠాకు చెందిన 11 మంది కీలక సభ్యులకు చైనా కోర్టు విధించిన మరణశిక్షను అధికారులు తాజాగా అమలు చేశారు. సమాజానికి పెను ముప్పుగా మారిన ఈ ముఠా ఆగడాలను అరికట్టే క్రమంలో భాగంగా, చైనా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 

సెప్టెంబర్ 2025లో జెజియాంగ్ కోర్టు వెలువరించిన తీర్పుతో ఈ ముఠా అరాచక పర్వం ముగిసింది. మయన్మార్ సరిహద్దు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ, 'మింగ్ మాఫియా'  గ్యాంగ్ అంతర్జాతీయ స్థాయిలో సైబర్ నేరాలకు పాల్పడింది. కేవలం ఆన్‌లైన్ మోసాల ద్వారానే వీరు సుమారు 1.4 బిలియన్ల డాలర్లు కొల్లగొట్టినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని డిజిటల్ నెట్‌వర్క్‌ల ద్వారా వీరు సృష్టించిన ఈ ఆర్థిక విధ్వంసం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. 

వీరి ఆదాయ వనరులన్నీ అక్రమ మార్గాల్లోనే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. కోర్టు విచారణలో ఈ ముఠా సభ్యులు కేవలం ఆర్థిక నేరాలకే పరిమితం కాకుండా, అత్యంత క్రూరమైన హింసకు పాల్పడినట్లు తేలింది. తమ దారికి అడ్డువచ్చిన వారిని హతమార్చడం, విదేశీయులను అక్రమంగా నిర్బంధించి వేధించడం వంటి చర్యలతో వీరు ఒక సమాంతర వ్యవస్థను నడిపారు. వీరి భయానక వాతావరణం వల్ల మయన్మార్ మరియు చైనా సరిహద్దుల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యేవారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...