చైనాలో నోరెత్తితే... కుటుంబం గల్లంతే!

posted on: Mar 28, 2016 2:56PM

 

చైనాలో మానవహక్కులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అలాంటి విషయాల గురించి మాట్లాడేవారు తరచూ గల్లంతైపోతుంటారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, ఏకంగా కుటుంబాన్నే మాయం చేసేస్తే! అలాంటి ఘటనే ఇప్పడు సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... న్యూయార్క్‌లో నివసించే ‘వెన్‌ యుంచావ్’ అనే చైనా పౌరుడు, చైనా అధ్యక్షుడిని విమర్శించే లేఖ ఒకదాన్ని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. అప్పటి నుంచీ చైనాలో ఉన్న వెన్‌ కుటుంబం మాయమైపోయింది.

 

చైనా అధికారులే తన తల్లిదండ్రులనీ, తమ్ముడినీ తీసుకువెళ్లిపోయారని ఆరోపిస్తున్నాడు వెన్. నిజానికి ఆ లేఖ తాను రాయలేదనీ, ఎవరో రాసిన లేఖను ట్విట్టర్‌లో పంచుకున్నాననీ వాపోతున్నాడు. కానీ వెన్ ప్రచురించిన లేఖని చైనా ప్రభుత్వం చాలా తీవ్రంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత చైనా అధ్యక్షుని వల్ల ఆ దేశానికి చాలా నష్టం జరిగిందనీ, కాబట్టి ఆయన తప్పుకోవాలని సదరు లేఖలో ఉంది. అంతంతేసి మాటలంటే కరణామయులైన చైనా అధికారులు ఎలా ఊరుకుంటారు. అందులోనూ చైనా అర్థిక స్థితి అంతంతమాత్రమేనని తేలుతున్న ఈ రోజుల్లో, చైనా ప్రభుత్వం ఏ విమర్శనీ కూడా సహించే స్థితిలో లేదట. అయినా తమ వంతుగా ఆమ్నస్టీ సంస్థ, వెన్‌ కుటుంబాన్ని విడుదల చేయవలసిందిగా చైనా ప్రభుత్వాన్ని కోరింది. చైనా ప్రభుత్వం నుంచి ఎప్పటిలాగే, ఈసారి కూడా ఎలాంటి ప్రతిస్పందనా లేదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...