చైనా మహాపతనం... ఇండియాకు వరమా? శాపమా??

posted on: Jul 30, 2026 5:34AM

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుదీర్ఘ కాలం పాటు వేగవంతమైన వృద్ధి రేటుతో దూసుకెళ్లిన చైనా, ప్రస్తుతం మహాపతనం దిశగా దిగజారుతోంది.  గతంలో రెండంకెల జీడీపీ వృద్ధి సాధించిన చైనా ఇప్పుడు  ఇప్పుడు ఆర్థిక స్తబ్దతలో కూరుకుపోయింది. చైనాలో   ఈ ఆర్థిక మందగమనం కేవలం తాత్కాలికమైన   మాంద్యం కాదని, కోలుకోలేని స్థాయికి చేరిన సుదీర్ఘ సంక్షోభమని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రుణ భారం, రియల్ ఎస్టేట్ రంగంలో కుప్పకూలిన ప్రాజెక్టులు, జనాభా సంఖ్యలో గణనీయమైన క్షీణత,  విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అనేక ప్రతికూల అంశాలు ఆ దేశ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ  పరిణామం గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుండగా..  ఆ ప్రభావం పొరుగున ఉన్న ఇండియాలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది.   

చైనా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా అప్పులపై ఆధారపడి నడిచే పెట్టుబడుల నమూనా కావడంతో..  ఇప్పుడు ఆ పునాదులే కదిలిపోతున్నాయి. గతంలో అమలు చేసిన కఠినమైన జనాభా నియంత్రణ విధానాలు ఇప్పుడు  అక్కడ వయోజనుల సంఖ్య పెరిగి,   కార్మిక శక్తిని గణనీయంగా తగ్గిపోవడానికి దోహదపడ్డాయి. దీనికి తోడు రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ప్రాజెక్టుల రద్దు,  డెవలపర్ల దివాళాల కారణంగా ఆ దేశ బ్యాంకింగ్ రంగం చతికిలబడింది. యువతలో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతుండటంతో పాటు ఉద్యోగావకాశాలు లేక గిగ్ ఎకానమీ లేదా అనధికారిక పనులపై ఆధారపడే వారి సంఖ్య కోట్లలోకి చేరింది. అలాగే..  అధునాతన సాంకేతికతలు,  సెమీకండక్టర్ చిప్‌లపై అమెరికా విధించిన కఠిన ఆంక్షలు ఆ దేశపు సాంకేతిక ప్రాభవాన్నిదారుణంగా  దెబ్బతీశాయి.  గత దశాబ్ద కాలంలో జపాన్ ఎదుర్కొన్న  ఆర్థిక దశాబ్దం కోల్పోవడం దీనినే జపానిఫికేషన్ అంటాం.  చైనీ ప్రస్తుతం అలాంటి జపానిఫికేషన్  పరిస్థితికే   చేరువైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

దేశీయ వినియోగం తగ్గడం, నామమాత్రపు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, పెరిగిన ప్రభుత్వ రుణాలు ఆ దేశంలో మూలధన తరలింపునకు  దారితీస్తున్నాయి.  శ్రీమంతులు, అంతర్జాతీయ సంస్థలు తమ పెట్టుబడులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండటంతో చైనా కమ్యూనిస్ట్ పార్టీ   తీవ్ర ఒత్తిడిలోకి జారిపోయింది.  మార్కెట్లను నిలబెట్టేందుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రజా పొదుపు మొత్తం ఉత్పాదకత లేని రంగాలు, రుణ చక్రాలకే సరిపోతోంది.  రాజకీయ వ్యాపార వర్గాల్లోనూ ఈ పరిణామాలు తీవ్రమైన ఉద్రిక్తతలను రేపుతున్నాయి. అధికార వర్గాలు పదేపదే నిఘా, సెన్సార్‌షిప్‌ను పెంచడం వల్ల కొత్త రకం ఆవిష్కరణలకు అడ్డుకట్ట పడుతోంది. సైన్యంలోనూ, పార్టీ శ్రేణుల్లోనూ జరుగుతున్న అంతర్గత ప్రక్షాళనలు అక్కడ అధికార సుస్థిరత లోపించిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 

మరొకవైపు, టిబెట్ ప్రాంతంపై అధికారిక నియంత్రణను బిగించేందుకు బీజింగ్ ప్రయత్నిస్తుండగా, అంతర్జాతీయంగా దాని చట్టబద్ధతపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవన్నీ కలిసి చైనా సామాజిక ఒప్పందాన్ని,  ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న నమ్మకాన్ని సడలించేలా చేస్తున్నాయి. 

 ప్రపంచ సరఫరా గొలుసు   రీ అలైన్‌మెంట్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఈ పరిస్థితి భారతదేశానికి ఒక సువర్ణ అవకాశంగా కనిపిస్తోంది. వ్యాపార దిగ్గజాలు చైనా + 1  వ్యూహంలో భాగంగాఇండియా  వైపు చూస్తుండటంతో, ఇండియా దేశ తయారీ, ఎలక్ట్రానిక్స్,  ఫార్మా రంగాలు వేగంగా వృద్ధి చెందే ఆస్కారం ఏర్పడింది. పెట్టుబడులను ఆకర్షించడంలోనూ, ప్రపంచ సరఫరా వ్యవస్థలో కీలక భాగస్వామిగా నిలవడంలోనూ భారత్ ప్రస్తుతం అత్యంత అనుకూలమైన స్థితిలో ఉంది.  అయితే..  చైనా బలహీనపడటం కేవలం భారత్‌కు ప్రయోజనకరమే అని భావించడం వ్యూహాత్మక పొరపాటు అవుతుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

చైనా తన అంతర్గత ఆర్థిక సంక్షోభం మరియు విమర్శల నుంచి దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు జాతీయవాదాన్ని విపరీతంగా రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. దీని ప్రభావం భారత్‌తో ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద త ఉద్రిక్తతలు పెచ్చరిల్లేందుకు దారితీసే అవకాశం లేకపోలేదు. సైనిక పరమైన సాహసాలకు ఒడిగట్టడం ద్వారా తన పట్టును నిలుపుకోవాలని చైనా   ప్రయత్నించవచ్చు.  రాబోయే రోజుల్లో చైనా నుండి భారతదేశ మార్కెట్లోకి చౌకైన ఉత్పత్తులు పెద్ద ఎత్తున డంపింగ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది   దేశీయ పారిశ్రామిక రంగాన్ని, ఆత్మనిర్భర్ భారత్ ఆశయాలను దెబ్బతీసే అవకాశం ఉంది.

టెలికాం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, ఎలక్ట్రిక్ వాహనాల సరఫరా వ్యవస్థల్లో చైనా పెట్టుబడులు, యు సాంకేతికత చొరబడకుండా భారత ప్రభుత్వం మరింత అప్రమత్తంగా భద్రతా తనిఖీలను కఠినతరం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల ద్వారా కూడా చైనా తన ఆర్థిక, రాజకీయ ప్రభావాలను చూపించేందుకు యత్నించవచ్చు.  మొత్తంగా  చైనా ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక సంక్షోభం భారత్‌కు అటు అవకాశాలను, ఇటు   భద్రతా సవాళ్లను ఏకకాలంలో ముందుకు తెచ్చింది. చైనా బలహీనతలను కేవలం ఒక వరంగా పరిగణించకుండా, తగిన ఆర్థిక, పారిశ్రామిక,  భద్రతా నమూనాలను సిద్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే భారత్ ఈ శతాబ్దంలో కీలక ప్రపంచ శక్తిగా ఆవిర్భవించగలదు.

 -సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.    

China economic slowdown, China real estate crisis, China Japanification, China debt crisis, China vs India trade, China supply chain shift

google-ad-img
    Related Sigment News
    • Loading...