చెల్లిని అమ్మొదంటూ అక్కల రోదన.. నల్గొండ జిల్లాలో శిశువిక్రయం కలకలం
posted on Oct 28, 2025 1:39PM

నల్గొండ జిల్లాలో శిశువిక్రయం కలకలం సృష్టించింది. పేదరికం, ఇద్దరు అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండటం నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఎల్లాపురం కు చెందిన కొర్రబాబు, పార్వతి దంపతులు తమ శిశువును మూడు లక్షల రూపాయలకు విక్రయించారు. ఈ గిరిజన దంపతులు ఏడేళ్ల కిందట
నల్గొండకు వలస వచ్చారు. 2006లో వారికి ఒక బాబు పుట్టి కొద్ది రోజులకే చనిపోయాడు. అనంతరం ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. 10 రోజుల కిందట 4వ కాన్పులో పార్వతికి మరో ఆడపిల్ల పుట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడం, పేదరికం వల్ల మరో ఆడపిల్లను సాకలేమంటూ.. దళారుల ద్వారా ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన వారికి తమ శిశువును రూ. 3 లక్షల రూపాయలకు పెద్దవూర మండలం ఊరబావి తండాకు సమీపంలో పొట్టిచెలమ వద్ద చిన్నారిని కొనుగోలుదారులకు అప్పగించారు. ఈ సందర్భంగా అంటే శిశువును అప్పగిస్తుండగా, పార్వతి, కొర్రబాబు ఇద్దరు పెద్ద బిడ్డలు అమ్మా.. చెల్లెను అమ్మొద్దే అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతున్న వీడియోలు బయటకు రావడంతో ఈ శిశువిక్రయం విషయం వెలుగులోకి వచ్చింది.
అంతే కాకుండా తన సోదరుడి పది రోజుల పాప కనిపించడం లేదంటూ కొర్ర బాబు అన్న సురేశ్ ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది. శిశు విక్రయం ఘటనకు సంబంధించి నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐసీడీఎస్ సూపర్ వైజర్ సరస్వతి ఫిర్యాదు మేరకు.. శిశువును అమ్మిన తండ్రితో పాటు కొనుగోలుదారులు, మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు. ఇలా ఉండగా ఈ శిశువిక్రయం సంఘటనపై మంత్రి సీతక్క స్పందించారు.
ఈ సంఘటనకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కృతి ఓజాలను ఆదేశించారు. పిల్లల అమ్మకాలు, అక్రమ దత్తతపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం అత్యంత బాధకరమని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. విక్రయించిన శిశువును వెంటనే సంరక్షణలోకి తీసుకుని, తల్లిదండ్రుల పరిస్థితిని తెలుసుకోవాలని, ఈ విషయంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.