మోడీతో సమరానికి కేసీఆర్ పచ్చజెండా..?

అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మోడీతో సాన్నిహిత్యం కోసం దేశంలోని పార్టీల అధినేతలు.. ముఖ్యమంత్రులు నమో భజన చేశారు. రాష్ట్రాభివృద్ధి కానివ్వండి.. కేంద్రంలో మంత్రి పదవులు కానివ్వండి. మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆయన అడక్కుండానే సాయానికి సిద్ధమై ప్రధాని దృష్టిలో పడాలని తపించిన వారు ఎందరో. అలా పుణ్యకాలం కాస్తా గడిచిపోయింది. అతి త్వరలో ఎన్నికల నగారా మోగబోతోంది. కబుర్లతో కాలక్షేపం చేస్తే జనం నుంచి ఓట్లు రావు కదా..? అందుకే కేంద్రంపై తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు. అలాంటి వారిలో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకరు.

 

సీఎంగా అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రధాని మోడీని ఆయన కానీ.. టీఆర్ఎస్ నేతలు కానీ పల్లెత్తు మాట అన్న దాఖలాలు లేవు. నోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలకు కేసీఆర్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే బీజేపీతో అప్రకటిత మిత్రపక్షంగానే వ్యవహరిస్తూ వచ్చారు. అలాంటిది కేసీఆర్ స్వరంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. తొలిసారిగా కేంద్రప్రభుత్వంపైనా.. ప్రధాని మోడీపైనా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో జరిగిన రైతు సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి కేంద్రంపై సున్నిత విమర్శలు చేశారు.

 

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలంటూ తీర్మానించారు. ఇదే విషయమై తాను కేంద్రాన్ని చాలాసార్లు కోరాననీ.. కానీ ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శించారు. మన రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితికి కారణం బీజేపీ, కాంగ్రెస్‌లేనన్నారు. ఈ విషయం గురించి ప్రధాని నరేంద్రమోడీకి.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి.. బీజేపీకి చెందిన ఓ కీలకనేతకు చెప్పానని కానీ వారికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. మార్చి 5 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు సమావేశాల్లో రైతుల అంశంపై బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆదేశించారు. కేసీఆర్ తీరు చూస్తుంటే.. ప్రధాని మోడీతో సమరానికి సై అన్న సంకేతాలు ఇచ్చినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని ఢీకొడుతున్న వేళ.. మరో తెలుగు రాష్ట్రపు ముఖ్యమంత్రి ప్రధానిపై విమర్శలు చేయడం పట్ల బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu