కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్ర జరుగుతోందా..?

posted on: Jun 15, 2016 5:47PM

తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు జరుగుతున్నాయి..? ఇది ఎవరో అనామకుడు చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాటలు. పార్టీలోకి కొత్త నాయకులు వస్తున్న వేళ..పార్టీ నేతల సమక్షంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పన్నాయని ఆయన బాంబు పేల్చారు. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్రనాయక్ తదితరులు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని కూలదోసి..రాష్ట్రపతి పాలన పెట్టించాలని ఆ రెండు పార్టీలు కుట్రపన్నాయని ఆరోపించారు.

 

ఈ విషయాన్ని తనకు ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు..ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారన్నారు. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఆయన తనకు ఫోన్ చేయగా ఇంటికి పిలిచానని, అక్కడే ఆయన తనకు ఈ విషయం చెప్పారన్నారు. ఇదేం అన్యాయమని, రాష్ట్రం ఏర్పడకుండా అడ్డుకోవడమే కాకుండా..వచ్చిన రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్ర పన్నుతారని ఒవైసీ తన వద్ద ఆవేదన వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు కూడా తెలుగు రాష్ట్రాలు మళ్లీ ఏకమవుతాయని పదే పదే చెబుతున్నారని..దానికి ఈ కుట్రే నిదర్శనమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రభుత్వం మధ్యలో పారిపోతుందన్నారని చెప్పారు. మరి ఈ వ్యాఖ్యలు నిజమేనా లేదంటే ప్రతిపక్షాలను మాట్లాడకుండా చేసే ఎత్తుగడ అన్నది త్వరలో తేలిపోనుంది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...