"కానుక"ల చుట్టూ కన్నడ రాజకీయం..!

posted on: Apr 16, 2016 6:01PM

కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం కానుకల చుట్టూ తిరుగుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా నేతాశ్రీలు గిఫ్ట్ లు అందుకోవడంతో ‌కన్నడ నాట వివాదాలు తెచ్చిపెడుతున్నాయి. కర్ణాటకకు చెందిన ఏ రాజకీయ నాయుకుడు వార్తల్లో నిలిచినా దాని వెనక కారణం ఒక్కటే "కానుక". మొన్నటికి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 70 లక్షల విలువైన వాచీ అందుకోవడంతో రేగిన దుమారం అంతా ఇంతా కాదు. బీజేపీ, జేడీఎస్‌లు సిద్ధూతో వాచ్ ఆట ఆడుకున్నాయి. పార్టీ పరువు గంగలో కలిసిపోతుందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యకి వార్నింగ్ ఇవ్వడంతో దీనిపై అసెంబ్లీ సాక్షిగా సీఎం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 

కేరళకు చెందిన డాక్టర్ గోపాల పిళ్లై, తనకు వాచ్ ఇచ్చారని, ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో ఉన్నారని సిద్ధరామయ్య చెప్పారు. బెంగుళూరు వచ్చినప్పుడు తాను వద్దంటున్నా వినకుండా తన చేతికి వాచ్ తొగిడారని అన్నారు. దీనిపై ఇంత రాద్ధాంతం అవుతుందని అనుకోలేదని సిద్దూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఆ వాచ్ పెట్టుకోనని..అసెంబ్లీ హాల్‌లో పెట్టేస్తానని ప్రకటించారు.

 

ఇది సద్దుమణిగిందో లేదో మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరో గిఫ్ట్ వివాదంలో ఇరుక్కున్నారు. మురుగేశ్ నిరానీ అనే రాజకీయనాయకుడు కోటి విలువైన లాండ్ క్రూయిస్ కారును బహుమతిగా అందించాడు. ఇది కాస్తా ఇప్పుడు వివిదాస్పద అంశంగా మారింది. దీనిలోనే తాను ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పడంతో రాజకీయ రంగును పులుముకుంది. కారు విషయమై కాంగ్రెస్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించింది. అసలే సిద్దూ వాచ్ వివాదంతో ఒక ఆటాడుకున్న బీజేపీకి సరైన స్ట్రోక్ ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్‌కి యడ్యూరప్ప తనంతట తనే జుట్టు అందించారు. ఈ కొత్త వివాదం నుంచి యడ్యూరప్ప ఎలా బయటపడతారో. మొత్తానికి కన్నడనాట రాజకీయాల్ని గిఫ్ట్‌లు శాసిస్తున్నట్టు మరోసారి రుజువైంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...