బాబు ర్యాంకుల వెనుక మర్మం ఏంటీ..?

posted on: Feb 6, 2018 11:02AM

దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులందరితో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రూటే సెపరేటు అంటారు రాజకీయ విశ్లేషకులు. పరిపాలనలో టెక్నాలజికీ పెద్ద పీట వేసి.. మొత్తం సెక్రటేరియేట్‌‌ను ప్రజల ముందుకు తీసుకువచ్చి.. హైటెక్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు బాబు. 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశైనా.. 13 జిల్లాల నవ్యాంధ్రప్రదేశైనా చంద్రబాబులో మాత్రం అదే ఉత్సాహం.. కొత్తగా ఇంకేదో చేయ్యాలనే తపన. గతంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ సర్వే చేయించి.. ప్రభుత్వ పనితీరును తెలుసుకునేవారు నాయుడు గారు.

 

ఇప్పుడు అదే ఫార్ములాను ఉపయోగించి మంత్రులు, శాసనసభ్యుల పనితీరుపై సర్వే చేయించి.. ర్యాంకులు ఇస్తున్నారు. తాజాగా తమ మంత్రిమండలి సభ్యుల పనితీరుపై ర్యాంకులు ప్రకటించారు ముఖ్యమంత్రి. దీనిలో పురపాలక శాఖ మంత్రి నారాయణకు మొదటి ర్యాంక్ ఇవ్వగా.. నారా లోకేష్‌కు సెకండ్ ప్లేస్ ఇచ్చారు సీఎం. మూడవ స్థానంలో సుజయ కృష్ణరంగారావు, చివరి రెండు స్థానాల్లో ఆదినారాయణ రెడ్డి, గంటా శ్రీనివాస్ ఉన్నారు. ఫైల్స్ క్లియరెన్స్, శాఖలపై పట్టు తదితర అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి ఈ ర్యాంకులను ప్రకటించారు.

 

అసలు చంద్రబాబు ఈ ర్యాంకులను ఎందుకు ప్రకటించారు అంటూ.. సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. రాబోయేది ఎలక్షన్ సీజన్.. ఈలోగా మంత్రుల్లో ఎవరి సమర్థత ఏంటనేది.. జనంలోకి వెళ్లాలి. దానితో పాటు బాగా కష్టపడేవారికే నెక్ట్స్ ఛాన్స్ అన్న భయం మంత్రుల్లోనూ ఉండాలి.. అందుకే చంద్రబాబు ఈ ర్యాంకుల విధానాన్ని ప్రవేశపెట్టారనే కథనాలు వస్తున్నాయి. తోటి వారు మంచి ర్యాంకులు సాధించి.. తాము వెనుకబడిపోవడంతో.. తమపై అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని కొందరు మంత్రులు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు పోలిటికల్ వర్గాల్లో డిస్కషన్ నడుస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...