కుక్కను హింసించిన విద్యార్థులపై కాలేజీ వేటు..

posted on: Jul 7, 2016 4:47PM

మూగజీవి అని చూడకుండా అత్యంత హేయంగా ఓ కుక్కను మూడంతస్తుల భవంతిపై నుంచి విసిరేసి పైశాచికంగా ఆనందించిన ఇద్దరు మెడికల్ విద్యార్ధులను సస్పెండ్ చేస్తున్నట్లు వారు చదువుతున్న కాలేజ్ యాజమాన్యం ప్రకటించింది. చెన్నైకి చెందిన గౌతమ్ సుదర్శన్‌ అనే విద్యార్ధి చెన్నై శివారు తండాలంలోని మధా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతనితో పాటు మరో విద్యార్ధి కుక్కపై తమ రాక్షససత్వాన్ని ప్రదర్శించారు. తన ఇంటి టెర్రస్‌పై నిలబడి, కుక్కను పిట్టగోడపై నిలబెట్టి, మేడపై నుంచి విసిరేసి దారుణంగా ప్రవర్తించారు.

 

చేస్తున్నది రాక్షస క్రీడ అయినా ఎంతో ఆనందంగా నవ్వుతూ గౌతమ్ కెమెరాకు ఫోజు ఇచ్చాడు. అంతే కాకుండా ఆ మూగజీవి ప్రాణభయంతో అరుస్తూ నేలపై పడటాన్ని సైతం స్లో మోషన్‌లో వీడియో తీసి ఆనందించాడు. ఆ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేయడంతో రంగంలోకి దిగిన చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో అందులో ఉన్న గౌతమ్ తన స్నేహితుడేనని చెప్పడంతో ఆ శాడిస్ట్ ఆచూకీ తెలిసింది.

 

పోలీసులు తమను వెతుకుతున్నారని తెలుసుకున్న గౌతమ్, మరో విద్యార్ధి ఆశిష్ పాల్ చెన్నై నుంచి పారిపోయారు. అయితే పోలీసులు వారిని వెంటాడి పట్టుకున్నారు. వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలుకెళ్లకుండా తప్పించుకున్నా..వారు చదువుతున్న కళాశాల మాత్రం వారు వైద్యులుగా పనికిరాని భావించి సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వీరికి ఈ శిక్ష సరిపోదని నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...