Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రదానిపై చంద్రబాబు పొగడ్తలు.. వ్యక్తి పూజకు నిదర్శనమేనా?
posted on: Aug 6, 2026 6:25PM
.webp)
భూమిపై ఉన్న ఏ శక్తి కూడా నరేంద్ర మోదీ నాయకత్వ ప్రయాణాన్ని వచ్చే 25 సంవత్సరాలు ఆపలేదు అనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యాఖ్య, సాధారణ రాజకీయ పొగడ్తను దాటి, భారత ప్రజాస్వామ్య భవిష్యత్తు, రాజ్యాంగ వ్యవస్థ, శక్తి సమతుల్యతపై గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. భోగాపురం విమానాశ్రయ ప్రారంభ వేదికపై చేసిన చంద్రబాబు చేసిన ప్రసంగంలో.. “మోదీ లేకుండా వికసిత్ భారత్ 2047 ను ఊహించలేమన్న వాక్యం, వ్యక్తి, కేంద్రిత రాజకీయ సంస్కృతి ఎంత లోతుగా పాతుకుపోయిందో ప్రస్ఫుటంగా ఎత్తి చూపింది.
ఈ వ్యాఖ్యను కేవలం ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అధినేతగా చేసిన పొగడ్తగా తీసుకోవడం సులభమే కానీ.. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి.. దేశం మొత్తం ప్రధాని మోడీ నాయకత్వాన్ని రక్షించాలి అని పిలుపునివ్వడం.. ప్రజాస్వామ్యంలో అధికార మార్పిడి అనే మూల సూత్రాన్ని సవాలు చేసే రాజకీయ, సాంస్కృతిక సంకేతంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.
మోదీ 25 ఏళ్ల ప్రస్థానం
నరేంద్ర మోదీ రాజకీయ ప్రయాణాన్ని చంద్రబాబు నాయుడు పాతికేళ్ల కాలపరీక్షకు నిలిచిన నాయకత్వంగా చిత్రీకరించారు 2001 నుంచి 2014 వరకూ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తరువాత భారత ప్రధానిగా 2014నుంచి ఇంకా సాగుతున్న కాలాన్ని కలిపి చంద్రబాబు పాతికేళ్ల ప్రస్థానం అన్నారు.
గుజరాత్ కాలం.. 2002 గుజరాత్ అల్లర్లు మోదీ రాజకీయ జీవితంలో వివాదాస్పద అధ్యాయం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణల్లో ప్రత్యక్ష న్యాయపరమైన బాధ్యత నిరూపితం కాలేదు కానీ, రాజకీయ–నైతిక బాధ్యత ప్రశ్న మాత్రం దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికీ చర్చకు గురవుతూనే ఉంది. అదే సమయంలో.. గుజరాత్ మోడల్ పేరుతో పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, రహదారి, విద్యుత్, పోర్టు మౌలిక సదుపాయాల అభివృద్ధి, మోదీని ప్రో–బిజినెస్, ప్రో–గ్రోత్ నాయకుడిగా బ్రాండింగ్ చేసింది.
జాతీయ స్థాయికి ఎదుగుదల.. 2014లో అభివృద్ధి, బలమైన నాయకత్వం అనే ద్వంద్వ నినాదాలతో మోదీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 2019లో మరింత భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం.. వ్యక్తి–కేంద్రిత ఎన్నికల రాజకీయాలకు ఒక మైలురాయిగా నిలిచింది. మోదీ వర్సెస్ ఎవరు అనే ప్రశ్న భారత ఎన్నికల రాజకీయాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వం, బలమైన ప్రతిపక్షం, కూటమి రాజకీయాల స్థలాన్ని క్రమంగా సంకుచితం చేసింది.
భోగాపురం వేదిక నుంచి .. 2047 వరకూ
2026 ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో కలిసి, మోదీ నాయకత్వానికి బహిరంగ మద్దతు ప్రకటించారు.
ఈ వేదికపై: వితౌట్ మోడీ వి కాంట్ ఇమేజిన్ 2047, ఇండియా ఈజ్ ఫార్జునేట్ టు హావ్ ఏ టెస్టెడ్ లీడర్, ఫర్ 25 ఇయర్స్, నరేంద్రమోడీ యాస్ చీఫ్ మినిస్టర్ అండ్ ప్రైమినిస్టర్ హాజ్ డన్ ఎక్స్ట్రాడినరీ వర్క్, వి హావ్ టు ప్రొటెక్ట్ హిజ్ లీడర్ షిప్ అన్న చంద్రబాబు వ్యాఖ్యలు కేవలం పొగడ్తలు కావు, ఎన్డీయే రాజకీయ సమీకరణానికి, కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తుకు ఒక స్పష్టమైన సంకేతం.భోగాపురం వేదికగా చంద్రబాబునాయుడు చేసిన ప్రసంగంలో ఐటీ నుంచి ఏఐ యుగానికి మారుతున్న ప్రపంచంలో, బలమైన నాయకత్వం అవసరం అని చెబుతూ.. మోదీని ప్రపంచంలోనే టాలెస్ట్ లీడర్ గా అభివర్ణించారు.
రాజ్యాంగం, పదవీకాలం, ప్రజాస్వామ్య సమతుల్యత
భారత రాజ్యాంగం ప్రకారం, ప్రధానమంత్రి పదవీకాలం ఐదు సంవత్సరాలు. ప్రతి ఎన్నికలో ప్రజల తీర్పు ఆధారంగా అధికార మార్పిడి లేదా కొనసాగింపు నిర్ణయమౌతుంది. నో పవర్ ఆన్ ఎర్త్ కేన్ స్టాప్ హిజ్ లీడర్ షిప్ జర్నీ ఫర్ ద నెక్ట్స్ 25 ఇయర్స్ అన్న చంద్రబాబు వ్యాఖ్యలు.. రాజ్యాంగ సూత్రాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించకపోయినా, భావపరంగా ప్రజాస్వామ్య ప్రక్రియను అనివార్య నాయకత్వం అనే భావనతో ముసుగులో పెట్టే ప్రమాదం ఉంది.
న్యాయపరంగా.. భారత రాజ్యాంగం ఏ వ్యక్తికీ జీవితకాల నాయకత్వ హామీ ఇవ్వదు. ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, మీడియా, పౌర సమాజం ఇవన్నీ కలిపి చెక్స్ అండ్ బ్యాలన్సెస్ వ్యవస్థను నిర్మిస్తాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశం మొత్తం ఆయన నాయకత్వాన్ని రక్షించాలి అని పిలుపునివ్వడం, రాజ్యాంగపరంగా నిషేధితమేమీ కాకపోయినా.. ప్రజాస్వామ్య సంస్కృతిలో వ్యక్తి పూజ ను బలపరచే రాజకీయ సాంస్కృతిక ప్రకటనగా దీనిని చూడాల్సి ఉంటుంది.
ఇక్కడ కాలింగ్ ఏ స్పేడ్ స్పేడ్ అంటే ప్రజాస్వామ్య విలువలను బలపరచడం కాదు. వ్యక్తి కేంద్రిత అధికారాన్ని సాధారణీకరించడం. ప్రజల ఓటు, రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థ ఇవన్నీ కూడా శక్తి కాదా? అనే ప్రశ్నను తప్పించుకుంటుంది.
బీజేపీ, తెలుగుదేశం జనసేన సమీకరణం, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, జాతీయ రాజకీయాలు
చంద్రబాబు నాయుడు వ్యాఖ్యను.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాస్తవాల నుంచి వేరు చేసి చూడలేం. 2024 లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి తెలుగుదేశం కీలక మిత్రుడిగా అవతరించింది. ఆర్థిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రత్యేక ప్యాకేజీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం దిల్లీతో సాన్నిహిత్యం అవసరాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో..
భోగాపురం విమానాశ్రయం వంటి భారీ ప్రాజెక్టుల ప్రారంభ వేదిక, కేంద్ర, రాష్ట్ర సంబంధాల ప్రదర్శన వేదికగా మారింది. మోదీ నాయకత్వాన్ని రక్షించాలి అనే పిలుపు, ఒకవైపు కేంద్రంతో రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలపరచే ప్రయత్నం కాగా, మరోవైపు, రాష్ట్రంలో మోదీ, బాబు, పవన్ త్రిమూర్తి బ్రాండింగ్ కు విజువల్ నేరేటివ్ గా చూడాలి. తెలుగుదేశం గతంలో యూపీఏ, ఎన్డీయే మధ్య రాజకీయంగా మారుతూ వచ్చిన పార్టీ. ఇప్పుడు ఎన్డీయేలో కీలక భాగస్వామిగా, మోదీ వ్యక్తిత్వానికి బహిరంగ మద్దతు ఇవ్వడం.. పార్టీకి జాతీయస్థాయిలో ప్రో మోదీ ఇమేజ్ ను స్థిరపరచే ప్రయత్నం.
జాతీయ స్థాయిలో, ఈ వ్యాఖ్య, ఇప్పటికే బలహీనపడిన ప్రతిపక్ష రాజకీయాలకు, మోదీకి ప్రత్యామ్నాయం లేదు అనే సందేశాన్నిబలంగా ఇస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన సంకేతం కాదు.. ఎందుకంటే, ప్రజాస్వామ్యం వ్యక్తులపై కాదు, సంస్థలపై, విధానాలపై, ప్రజల తీర్పుపై నిలబడాలి.
సామాజిక–మీడియా కోణం.. వాస్తవాలు, విరుద్ధాలు
చంద్రబాబు నాయుడు, మోదీ నాయకత్వాన్ని సమర్థించడానికి ప డిజిటల్ ఇండియా, డీబీటీ, జీఎస్టీ, ఇన్ఫ్రా స్ట్రక్చర్, గ్రీన్ ఎనర్జీ, జాతీయ భద్రత రంగాలను ఉదాహరణగా చూపించారు. డిజిటల్ ఇండియా, డీబీజీ, యూపీఐ, ఆధార్ ఆధారిత డీబీటి, జనధన్, వంటి వ్యవస్థలు, నిజంగా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా గుర్తింపు పొందాయి. కోట్లాది ప్రజలకు నేరుగా సబ్సిడీలు, పింఛన్లు, సంక్షేమ పథకాలు చేరడం, మధ్యవర్తుల అవినీతిని చాలా వరకూ తగ్గించింది. అదే సమయంలో, ఆధార్ డేటా ప్రైవసీ, బయోమెట్రిక్, సర్వైలెన్స్, డిజిటల్ ఎక్స్క్లూజన్ వంటి సమస్యలు కూడా చర్చకు వచ్చాయి.
జీఎస్టీ సంస్కరణ, పన్ను వ్యవస్థను ఏకరీకరణ చేయడంలో కీలక అడుగు. కానీ, చిన్న వ్యాపారాలు, ఎమ్ఎస్ఎమ్ఈలు, రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్ర్యం, జీఎస్టీ పరిహారం వంటి అంశాలపై తీవ్ర అసంతృప్తి, నిరసనలు వ్యక్తమౌతున్నాయి. సంస్కరణ అనే పేరుతో వచ్చిన ఈ మార్పు, అమలు విధానంలో, రేటు నిర్మాణంలో, కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో పలు సమస్యలను సృష్టించింది.
మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, హైవేలు, మెట్రో రైలు, పోర్టులు, విమానాశ్రయాలు, రిన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి. కానీ.. అదే సమయంలో పర్యావరణ అనుమతులు, అటవీ సంరక్షణ, స్థానిక సమాజాల హక్కులు, భూసేకరణ వంటి అంశాల్లో, వికాసం వర్సెస్ హక్కులు అనే సంఘర్షణ పెరిగింది.
సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్, ఆర్టికల్ 360 రద్దు, సీఏఏ వంటి నిర్ణయాలు బలమైన జాతీయ భద్రత, నారేటివ్ ను బలపరిచాయి. అదే సమయంలో కాశ్మీర్లో ఇంటర్నెట్ నిలిపివేత, పౌర హక్కులపై ఆంక్షలు, నిరసనలపై కఠిన చర్యలు, ఉపా, సెడిషన్ వంటి చట్టాల వినియోగం, ప్రజాస్వామ్య స్వేచ్ఛలపై ప్రశ్నలను లేవనెత్తాయి.
భారత ప్రధాన మీడియా విభాగం, మోదీ ప్రభుత్వంపై విమర్శాత్మక పరిశీలన కంటే, నారేటివ్ amplification పాత్రను ఎక్కువగా పోషిస్తున్నదనే విమర్శ ఉంది. గోడి మీడియా అనే పదం, అధికార సానుకూల మీడియా ధోరణిని సూచించేలా ప్రజా చర్చలో స్థిరపడింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వంటి ప్రాంతీయ నాయకులు, మోదీకి బహిరంగ మద్దతు ఇవ్వడం, ప్రధాన మీడియా నారేటివ్ తో సులభంగా కలిసిపోతుంది.
వికసిత్ భారత్ అనే అనే లక్ష్యం, స్వతంత్ర భారత 100 ఏళ్ల ప్రయాణానికి ఒక అభివృద్ధి దృష్టి. కానీ, ఈ దృష్టిని ఒకే వ్యక్తి నాయకత్వంతో అనివార్యంగా కట్టిపడేయడం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన ధోరణి.
పార్లమెంట్ చర్చా స్థాయి, ఆర్డినెన్స్, బిల్లుల వేగవంతమైన ఆమోదం, ప్రతిపక్ష స్వరం, పార్లమెంటరీ కమిటీల పాత్ర ఇవన్నీ గత దశాబ్దంలో క్రమంగా తగ్గుముఖం పట్టాయి.
మోదీ వర్సెస్ ఎవరు అనే ప్రశ్న, విధానాలపై, స్థానిక సమస్యలపై, అభ్యర్థుల నాణ్యతపై చర్చను పక్కన పెట్టి, నాయకుడి ఇమేజ్ ను కేంద్రంగా పెట్టిన ఎన్నికల సంస్కృతిని బలపరుస్తోంది.
చంద్రబాబు నాయుడు వంటి నాయకులు, తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సాన్నిహిత్యం పెంచుకోవడం సహజమే. కానీ అటువంటి నేతల మితిమీరిన పొగడ్తలు వ్యక్తి పూజను సాధారణీకరించే ప్రమాదకరమైన రాజకీయ సాంస్కృతికి సంకేతం. సోషల్ మీడియా, ప్రత్యామ్నాయ డిజిటల్ ప్లాట్ఫారమ్ లు, స్వతంత్ర జర్నలిజం ఇవి మోదీ ప్రభుత్వంపై విమర్శాత్మక విశ్లేషణను కొనసాగిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రైతు సంక్షోభం, మైనారిటీ హక్కులు, మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యం వంటి అంశాలపై చర్చ ఉంది. ఈ నేపథ్యంలో, మోదీ లేకుండా 2047 ఊహించలేము అన్న చంద్రబాబు వ్యాఖ్య , ఈ సమస్యలను మరుగున పడేసే రాజకీయ ప్రచార నారేటివ్ గా కూడా చూడాలి.
చంద్రబాబు నాయుడు, మోదీ నాయకత్వాన్ని ప్రశంసించడం, ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అధినేతగా, ఏపీ సీఎంగా, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం రాజకీయంగా అర్థవంతమే. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార మార్పిడి, ప్రజల తీర్పు, రాజ్యాంగ సంస్థల పాత్రలను అనవసరమైన అడ్డంకులు గా భావించే ప్రమాదకరమైన రాజకీయ భావనను ప్రతిబింబిస్తోంది.
- సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
Chandrababu Naidu Modi Comments, Bhogapuram Airport Inauguration, AP CM Chandrababu Speech, Viksit Bharat 2047 Modi, TDP JSP BJP Alliance AP






