ఆంధ్రా అభివృద్ధి కోసం… అమెరికాలో చంద్రయానం!
posted on May 5, 2017 10:49AM
.jpg)
ఒకప్పుడు ప్రధానులు, ముఖ్యమంత్రులు అంటే నాయకుల్లానే వుండేవారు. రాజకీయాలు, ఉపన్యాసాలు… వీటితోనే సరిపెట్టేవారు. కాని, ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో సీన్ మొత్తం మారిపోయింది! ప్రధాని దేశానికి సీఈవో అయితే, సీఎంలు రాష్ట్రాలకి సీఈవోలు! వీళ్లు ముందటి వాళ్లలా కేవలం బిజీగా వుంటే సరిపోవటం లేదు. బిజినెస్ కూడా చూసుకోవాలి! తమ పాలనలోని ప్రాంతానికి ఎంత పెట్టుబడి వచ్చింది? ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఇవే ఇప్పుడు కీలకం అయ్యాయి! చంద్రబాబు లాంటి సీఎంలకి ప్లస్ పాయింట్ అవుతోంది కూడా అదే!
రాజకీయం చేసే నేతలు చాలా మందే వుంటారు. కాని, అభివృద్ది కళ్ల ముందు చూపటం అంత సులువు కాదు. చంద్రబాబు పాలనకి ముందు, పాలన తరువాత సైబర్ సిటీ హైద్రాబాద్ రూపే మారిపోయింది! ఎలా? వివిధ సాఫ్ట్ వేర్ కంపెనీల్ని ఆయన భాగ్యనగరికి రప్పించటం వల్ల! కేవలం సైబర్ టవర్స్ కట్టేసి ఊరుకుని వుంటే హైద్రాబాద్ ఇవాళ్ల వున్న పొజీషన్లో వుండేదే కాదు! కాని, సమైక్యాంధ్ర సీఎంగా బాబు తొమ్మిదేళ్లు కొనసాగినప్పుడు రేయింబవళ్లూ ఆయన ఎంతో కృషి చేశారు. తాను అమెరికా వెళ్లటమే కాదు .. బిల్ క్లింటన్నే తెలుగు వారి రాజధానికి తీసుకొచ్చారు! అదే ఎన్నో సత్ఫలితాల్ని ఇచ్చింది!
ఇప్పుడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా అమెరికాలో కాలుమోపిన మన సీఎం మరోసారి తన సీఈవో స్కిల్స్ చూపిస్తున్నారు. చూపించాల్సిన సమయం కూడా సరిగ్గా ఇదే! అమరావతితో ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న ఆంధ్ర రాష్ట్రానికి అత్యవసరంగా పెట్టుబడులు కావాలి. అప్పుడు అభివృద్ధి, ఉపాధి సాద్యమవుతాయి. అది సాధించగలరనే భరోసాతోనే జగన్ ని కాదని జనం చంద్రబాబుని ఎంచుకున్నారు! ఇప్పుడు సీఎం ప్రజలు తనపై వుంచిన నమ్మకాన్ని వమ్ము చేయకూడదనే అమెరికాలో అన్వేషణ కొనసాగిస్తున్నారు!
వాషింగ్టన్ డీసీ, శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా, న్యూయార్క్, షికాగో… ఇలా బోలెడు రాష్ట్రాలు పర్యటించనుంది చంద్రబాబు బృందం. క్షణం తీరిక లేకుండా సాగే ఈ ప్రయాణంలో అనేక అగ్రిమ్మెంట్లు కూడా జరగనున్నాయి. దాదాపు 300 మంది బడా బడా కంపెనీల సీఈవోలు ముఖ్యమంత్రిని కలుసుకోనున్నారంటే… ఎంత ప్లానింగ్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలాగే, యాపిల్ కంపెనీ ఇప్పటికే ఏపీకి వస్తుండగా మైక్రోసాఫ్ట్ ను ఒప్పించే ఆలోచనలో వున్నారు చంద్రబాబు. అదే జరిగితే రెండు ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ లతో ఏపీ రూపే మారిపోతుంది!
చంద్రబాబు అమెరికా పర్యటన ఫలితాలు ఇప్పుడే మనం అంచనా వేయలేకున్నా… ఆయన కృషిని, తపనని మాత్రం తప్పకుండా మెచ్చుకోవాల్సిందే!