చంద్రబాబు వాళ్ళతో కబడీ ఆడేసుకొన్నారు

 

ఈరోజు ఏపీ శాసనసభ సమావేశాలలో వైకాపా సభ్యుడు జ్యోతుల నెహ్రూ పట్టిసీమ ప్రాజెక్టుపై జరుగుతున్న చర్చలో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్ళందిస్తామని చంద్రబాబు నాయుడు ప్రజలకు మాయమాటలు చెపుతున్నారని, నిజానికి ఆ ప్రాజెక్టు పార్టీలో, ప్రభుత్వంలో అసమదీయులకు లబ్ది చేకూర్చేందుకే మొదలుపెట్టారని ఆరోపించారు.

 

దానికి చంద్రబాబు నాయుడు జవాబిస్తూ “ముందు మీరు ఈ పట్టిసీమ ప్రాజెక్టుకు అనుకూలమా లేక వ్యతిరేకిస్తున్నారా? అనే సంగతి స్పష్టంగా చెప్పండి. ఆ తరువాత నేను మీ విమర్శలకు జవాబు చెపుతాను,” అన్నప్పుడు జ్యోతుల నెహ్రు ఆయనకి సమాధానమిస్తూ ‘మేము ఆ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నాము,” అని అన్నారు.

 

అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ “ఒక ప్రాజెక్టుకి అనుకూలమో, వ్యతిరేకమో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్న మీరా మమ్మల్ని విమర్శించేది? మీ పార్టీలో జిల్లాకో పాలసీ ఉన్నట్లుంది. రాయలసీమకు చెందిన వాళ్ళు ఈ ప్రాజెక్టు కావాలి..నీళ్ళు రావాలి అంటారు. గోదావరి జిల్లాల సభ్యులు దీనిని వ్యతిరేకిస్తుంటారు. కృష్ణా జిల్లా నేతలు అవుననీ కాదనీ చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. ఒక అంశంపై నిర్దిష్టమయిన స్టాండ్ లేని పార్టీ వైకాపా. తాము ఏమి మాట్లాడదలచుకొన్నారో కూడా వాళ్లకి క్లారిటీ ఉండదు. పోలవరం పూర్తి చేసి రాయలసీమకు నీళ్ళు ఇమ్మని ఒకసారి డిమాండ్ చేస్తుంటారు. కానీ మళ్ళీ అంతలోనే దాని కోసం భూసేకరణ చేయడానికి వీలు లేదంటారు. భూమి లేకుండా ప్రాజెక్టుని ఎక్కడ కట్టాలి?"

 

"మేము పట్టిసీమ కడుతుంటే పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టేశామని విమర్శిస్తుంటారు. అయితే పోలవరం పూర్తయ్యేందుకు మరో నాలుగేళ్ళు పడుతుంది. అంతవరకు రాయలసీమకు నీళ్ళు ఇవ్వవద్దని మీరు చెపుతున్నారా?ఒకవేళ అక్కడా మీనాయకుడు ఓదార్పు యాత్రలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? మీకు దేని గురించి అవగాహన లేదు. కానీ ఏదో విమర్శించాలి గాబట్టి విమర్శలు చేస్తుంటారు. అయితే ప్రజలకు నీళ్ళు అందించేందుకు మేము చేస్తున్న ఈ ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డుపడుతూ, ఇలాగే విమర్శలు చేస్తుంటే ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్ళు అందించినప్పుడు, మీరే ప్రజలలో అవమానం పాలవుతారు."

 

"ఈ ప్రాజెక్టుకి మీరు ఎందుకు అడ్డుపడుతున్నారో నాకు తెలుసు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యి రాయలసీమకు నీళ్ళు అందించడం మొదలయితే అక్కడ మీ పార్టీకి ప్రజలలో ఆదరణ తగ్గిపోతుందని మీరు భయపడుతున్నారు. కానీ మీరు ఔనన్నా కాదన్నా మా ప్రభుత్వం రాయలసీమకు ఈ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందిస్తాము. ఇంతకు ముందు స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టినప్పుడు కూడా చాలా మంది ఇలాగే ఆటంకాలు సృష్టించారు..విమర్శలు చేసారు. కానీ ఆయన ఆనాడు ఎంతో దూరదృష్టితో చేసిన ఆ ప్రాజెక్టు వలన చెన్నై వాసులకే కాదు రాయలసీమ జిల్లాలకు కూడా నీళ్ళు పారుతున్నాయి. ఈ పట్టిసీమ ప్రాజెక్టుకి ఇప్పుడు మీ నుండి అటువంటి ఆటంకాలే ఎదురవుతున్నాయి. కానీ మేము వాటన్నిటినీ అధిగమించి రాయలసీమ జిల్లాలకు నీళ్ళు అందిస్తాము. అందులో మీ జగన్ స్వంత ఊరుకి కూడా నీళ్ళు అందిస్తాము."

 

"పోలవరం ప్రాజెక్టుని వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు నిర్దిష్టమయిన ప్రణాళికలను సిద్దం చేసుకొంటున్నాము. రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాజెక్టులను పూర్తి చేసి వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నదీ జలాలను భూములకు పారించి రాష్ట్రం నుండి కరువు రక్కసిని పారద్రోలుతాము. మీకు వీలయితే మంచి సూచనలు సలహాలు ఇవ్వండి. లేకుంటే మా మానాన్న మమ్మల్ని పనిచేసుకోనివ్వండి అంతే కానీ మాపై ఊరకనే రాళ్ళు విసిరే ప్రయత్నం చేయకండి. దాని వలన చివరికి మీరే ప్రజలలో అభాసుపాలవుతారు,” అని జవాబిచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ జవాబుతో వైకాపా సభ్యుల నోట మాట రాలేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu