త్వరలో చంద్రబాబు నాయుడు కరీంనగర్ పర్యటన

posted on: Feb 20, 2015 8:33AM

 

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ త్వరలోనే తెలంగాణాలో పర్యటించబోతున్నారు. వచ్చే నెల మార్చి 3వ తేదీన ఆయన కరీంనగర్ పర్యటించి అక్కడ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ అధ్యక్షతన నిన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయిన తెదేపా సీనియర్ నేతలు యల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితర తెలంగాణా నేతలు ఈ విషయాన్నీ ప్రకటించారు. ఇటీవల హన్మకొండలో పార్టీ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో అదేవిధంగా కరీంనగర్ సభను కూడా అందరూ సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈసారి కూడా చంద్రబాబు రోడ్డు మార్గాన్నే పయనించి కరీంనగర్ చేరుకొంటారని వారు ప్రకటించారు. తద్వారా దారి పొడవునా ఆయన ప్రజలను, పార్టీ కార్యకర్తలను, నేతలను కలిసే అవకాశం కలుగుతుందని వారి ఆలోచన.

 

ఈ విషయం తెలియగానే తెదేపా తెలంగాణా నేతల కంటే ముందుగా తెరాస నేతలే స్పందించవచ్చు. ఇంతకు ముందులాగే ఈసారి కూడా ఆయన రాష్ట్రంలో పర్యటించడాన్ని వారు ఆక్షేపించవచ్చు. వారికి తెదేపా నేతలు కూడా ధీటుగానే సమాధానం చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణాలో తన పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారు. పైగా అదే సమయంలో అనేకమంది తెదేపా సీనియర్ నేతలను తెరాసలోకి ఆకర్షించడంతో తెలంగాణాలో తెదేపా కొంత బలహీనపడింది.

 

ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నారా లోకేష్, తెలంగాణాలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు. అందులో భాగంగానే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించి తెలంగాణాలో కొత్తగా 10 లక్షల మంది సభ్యులను పార్టీలో చేర్పించగలిగారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటన, ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ పర్యటనకు కూడా రంగం సిద్దం చేస్తున్నారు. మున్ముందు ఇటువంటివి అనేక పర్యటనలు, సభలు, సమావేశాలకు లోకేష్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రాలో అయినా తెలంగాణాలో అయినా పార్టీ అధ్యక్షుడు మీదే పూర్తిగా ఆధారపడకుండా స్థానిక నేతలు కూడా తరచూ ఇటువంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లయితే పార్టీ బలంగా ఉండగలదనే విషయం పార్టీ నేతలు కూడా గ్రహిస్తే మంచిది.

google-ad-img
    Related Sigment News
    • Loading...