తుపాను బాధితులకు సాయంగా రూ.3 వేలు : సీఎం చంద్రబాబు
posted on Oct 27, 2025 9:49PM
.webp)
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.3,000 చొప్పున అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, వైద్య శిబిరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. అత్యవసర వైద్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం చేపడుతున్న సహాయక చర్యలు భవిష్యత్తు తుపానులకు ఆదర్శంగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.మొంథా' తుపాను ప్రభావంతో విజయవాడ నగరానికి వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన జారీ చేసింది.
మంగళవారం నగరంలో 16 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారు.
తుపాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం ఉద్ధృతంగా ఉన్న సమయంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలను మూసివేయాలని సూచించారు. అయితే, పాలు, కూరగాయలు, మెడికల్ షాపుల వంటి నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.