కేబినెట్ విస్తరణ.. బాబుకి బోలెడంత మైలేజీ..!!
posted on: Jul 6, 2018 12:51PM

ఏపీ సీఎం చంద్రబాబుకి రాజకీయ అనుభవం, తెలివితేటలే కాదు ముందుచూపు కూడా ఎక్కువ అంటుంటారు.. ఈ విషయం నిజమని చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు రుజువు చేసాయి.. అన్ని విషయాల్లో అలోచించి అడుగులు వేసే బాబు, త్వరలో మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.. 2014 లో కలిసి పనిచేసిన టీడీపీ, బీజేపీ నాలుగేళ్ళ తరువాత విడిపోయాయి.. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ మంత్రులు రాజీనామా చేసారు, అలానే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేసారు..
దీంతో ఏపీ కేబినెట్ లో రెండు మంత్రి స్థానాలు ఖాళీగా ఉన్నాయి.. త్వరలో కేబినెట్ విస్తరణ చేసి ఆ రెండు స్థానాలను మైనార్టీ, ఎస్టీ నేతలతో భర్తీ చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తుంది.. అదే విధంగా ఈ విస్తరణలో పనితీరు సరిగాలేని కొందరు మంత్రులను కూడా తొలగించే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది.. వీరి స్థానంలో చాలాకాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారికి మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట.. ఇదే జరిగితే ఎన్నికల ముందు, ఇటు కార్యకర్తల్లోనూ అటు ప్రజల్లోనూ చంద్రబాబుకి బోలెడంత మైలేజీ పెరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.. చూద్దాం మరి బాబు ఏం చేస్తారో.






