చంద్రబాబు ఏడాది పాలన అభినందనీయం
posted on: Jun 5, 2015 7:50AM

నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. గత ఏడాది జూన్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని, ఇప్పుడున్న పరిస్థితిని పోల్చి చూసకుంటే గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. అయోమయ స్థితి నుంచి అభ్యుదయం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పయనించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయగలిగారు. దారుణంగా మోసపోయి నిరాశ, నిస్పృహలతో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కొత్త ఉత్సాహం, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం పెరిగేలా చంద్రబాబు నాయుడు చేయగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత విపత్కర స్థితిలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే తమకు న్యాయం జరుగుతుందో వారికే అధికారం ఇచ్చి తమ విజ్ఞతను ప్రదర్శించారు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు వారి నిర్ణయం సరైనదేనని నిరూపించింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఏయే వాగ్దానాలు చేశారు, ఏయే వాగ్దాలనాలను నెరవేర్చారనే చిట్టా పద్దుల పుస్తకం పుస్తకం పట్టుకు తిరిగే పని ప్రతిపక్ష పార్టీ చేస్తోంది.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మెతుకు పట్టుకుని చూస్తే చాలనే చందాన ఏపీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలనే చంద్రబాబు చిత్తశుద్ధినే ప్రజలు గమనించారు... అర్థం చేసుకున్నారు... అభినందిస్తున్నారు.







.webp)


