చంద్రబాబు ... లోకేష్ శకానికి నాంది పలకనున్నారా?
posted on Feb 9, 2017 12:04PM

ఏ రాష్ట్రంలో అయినా, లేదా ఢిల్లీలో అయినా ... ఎప్పుడూ లేని రాజకీయ హడావిడి కనిపించేది ఒక్క మంత్రి వర్గ మార్పులు, విస్తరణ టైంలోనే! పదవి ఊడుతుందనే వారిలో ఆందోళన, వస్తుందని ఆశించే వారిలో ఉత్సుకత మాటల్లో చెప్పలేకుండా వుంటాయి. ఇప్పుడు అమరావతి కూడా అలాంటి పొలిటికల్ హీట్ తోనే వుంది! మీడియా, జనం దృష్టి మొత్తం పన్నీర్, శశికళ మధ్య సాగుతోన్న ఫైటింగ్ మీదే వున్నా... ఆంధ్రా పాలిటిక్స్ లో మాత్రం సైలెంట్ గా భారీ మార్పులకి రంగం సిద్ధమవుతోంది!
నవ్యాంధ్ర ఏర్పడి మూడో సంవత్సరం కూడా పూర్తి కావస్తున్నా చంద్రబాబు క్యాబినేట్ లో పెద్ద పెద్ద మార్పులు ఇప్పటి వరకూ జరగలేదు. అయితే, ఈ నెల పదహారో తేదీలోపు ఏ క్షణాన్నైనా క్యాబినేట్ రూపు, రేఖలు మారిపోవచ్చంటున్నారు. అయితే, ఈసారి అతి పెద్ద బ్రేకింగ్ న్యూస్ చినబాబు గురించే వుంటుందంటున్నారు. ఆల్రెడీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తన వంతు కృషి చేస్తోన్న లోకేష్ ఇక మరి కొద్ది రోజుల్లోనే బుగ్గ కారు ఎక్కేయటం గ్యారెంటీ అంటున్నారు. టీడీపీ నేతల అభిమతం ప్రకారం భవిష్యత్ ముఖ్యమంత్రి అయినా ఆయన తండ్రి క్యాబినేట్లో కీలక శాఖనే దక్కించుకుంటారని గట్టి టాక్. అసలు ఇప్పుడు జరగనున్న మంత్రి వర్గ మార్పు, చేర్పులన్నీ లోకేష్ ను పాలనలో ప్రవేశపెట్టేందుకే అంటున్నారు.
ఏపీ క్యాబినేట్ రీషఫల్ లో లోకేష్ ప్రధాన హైలైట్ గా నిలవనుండగా మిగతా వారు కూడా చాలా మంది కుదుపుకు గురయ్యే ఛాన్స్ వుందంటున్నారు. సీఎం ఇంకా అధికారిక నిర్ణయం ఏం తీసుకోకున్నా రకరకాల ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి దాకా కొందరు మంత్రులు చూపించిన పర్ఫామెన్స్, అలాగే మరికొందరి విషయంలో సామాజిక వర్గాల కూడికలు, తీసివేతలు... ఇవన్నీ ముఖ్యమంత్రి ప్రధానంగా పరికిస్తున్నారట!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడుగా వున్నకళావెంకట్రావు క్యాబినేట్లోకి వస్తారని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే ఆయన బంధువైన ప్రస్తుత మంత్రి మృణాళిని ఔట్ అవ్వాల్సి వస్తుంది. అలాగే, ఇప్పుడు మంత్రి వర్గంలో చిన రాజప్పను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడ్ని చేసే ఛాన్స్ కూడా వుందంటున్నారు. మరోవైపు రాజప్ప ఉద్వాసన కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రుకు వరంగా మారవచ్చు. ఆయన క్యాబినేట్లో చేరవచ్చు. ఇక నెల్లూరు సీనియర్ నేత, రెడ్డి సామాజిక వర్గం నుంచీ టీడీపీలో నిరంతరంగా వుంటోన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.
ఈ సారి మంత్రి వర్గ కూర్పులో మరో పెద్ద మార్పుగా చెప్పుకోవాల్సింది నారాయణ తొలగింపు. ప్రస్తుతం ఆయన కీలకమైన మంత్రుల్లో ఒకరు. ప్రభుత్వ నిర్ణయాల్లో చాలా వాటిల్లో ఆయన పాత్ర వుంటోంది. కాని, బాబు ఆయన్ని తాను చైర్మన్ గా వున్న సీఆర్ డీఏకు సారథిగా నియమిస్తారని అంటున్నారు.
ఆ మధ్య జరిగిన వైసీపీ వలసల్లో చాలా మంది చంద్రబాబుకు జైకొట్టారు. వీరి గురించి కూడా సీఎం సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం. వాళ్లు పార్టీలో చేరేప్పుడు పదవుల విషయంలో కొంత భరోసా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు ఒకట్రెండు మంత్రి పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారట! అదే జరిగితే వైసీపీ వలసల కోటాలో భూమా అఖిలప్రియను అమాత్య పదవి వరించవచ్చు. అలాగే, మరో నేత అమర్ నాథ్ రెడ్డి కూడా అమాత్యులు కావచ్చు. రెడ్డి వర్గం నుంచి సెక్రటేరియట్ వదిలి పెట్టాల్సి రావాల్సిన వాళ్లలో ప్రముఖంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి , పల్లె రఘునాథరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు మైనార్టీ వర్గం నుంచి చాంద్ పాషా, ఎంఏ షరీఫ్ పేర్లు కాబోయే మంత్రుల లిస్ట్ లో వున్నాయంటున్నారు. కాని, ఈ ఇద్దరికీగాని, ఒక్కరికిగాని ఎవ్వరికీ ఇంకా బెర్త్ కన్ ఫర్మ్ అయినట్టు మాత్రం అనిపించటం లేదు.
ఇక చంద్రబాబు ఖచ్చితంగా పక్కన పెట్టాలని భావిస్తున్న పేర్లుగా వినిపిస్తున్న రెండు .... రావెల కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు. వీళ్లిద్దరి వల్లా ప్రభుత్వానికి కొంత ఇబ్బంది కలుగుతోందని సీఎం భావిస్తున్నారట. రావెల చర్యలు, మాటలు ఇప్పటికే నష్టం కలిగించాయి. కాబట్టి ఆయన స్థానంలో ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్య మంత్రి అవుతారని అంటున్నారు. పత్తిపాటిని కూడా తొలిగిస్తే ఆయన స్థానంలో స్పీకర్ కోడెల మంత్రి అవుతారని అంటున్నారు. కాని, ఇది కొంత మేర డౌటే అని కూడా ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఉత్తరాంధ్ర లెక్కలు చూస్తే అక్కడ్నుంచీ మంత్రి వర్గంలో వున్న పీతల సుజాత, గంటా శ్రీనివాస రావులకి శాఖలు మారతాయని వినిపిస్తోంది. ప్రాధాన్యం కూడా తగ్గే అవకాశాలున్నాయి. జనాభలో అత్యధిక శాతంగా వున్న బీసీల విషయంలో కూడా బాబు పక్కాగా లెక్కలు వేసుకుని ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. పితాని సత్యనారాయణ, కొండబాబు, బీదా రవిచంద్ర లాంటి వారు మంత్రులయ్యే ఛాన్స్ వున్నాయి. వీళ్లెవరూ కాపులు కాదు. కాపులకే ఎక్కవ ప్రాధాన్యత దక్కుతోందని ఇతర బీసీ వర్గాలు అసంతృప్తిగా వున్నట్టు చంద్రబాబు గమనించటమే ఇందుకు కారణం అంటున్నారు. కాకపోతే, ఇంకా ఫైనల్ లిస్ట్ లో వుండే పేర్లు ఎవరివో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.
మంత్రి వర్గ రూపు, రేఖలు ఎప్పుడు మారతాయో ఖచ్చితంగా తెలియదుగాని.. అతి త్వరలోనే లోకేష్ మొదలు స్పీకర్ కోడెల వరకూ టీడీపీలో చాలా మంది డెయిలీ రొటీన్ త్వరలోనే మారనుందనేది మాత్రం గ్యారెంటీ!