తెలంగాణాలో పర్యటిస్తా..పార్టీని బలోపేతం చేస్తా..చంద్రబాబు
posted on: Sep 3, 2014 9:35AM
.jpg)
తెదేపా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడటంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందిస్తూ, “తెలుగుదేశం పార్టీకి పార్టీ కార్యకర్తలే బలం. పార్టీలో నుండి ఎందరు నేతలు బయటకు వెళ్ళిపోయినా, నేటికీ పార్టీ అంతే పటిష్టంగా నిలబడి ఉండటమే అందుకు ఒక సజీవ ఉదాహరణ. అందువలన ఒకరిద్దరు నేతలు పార్టీని వీడిపోయినంత మాత్రాన్న పార్టీకి ఎటువంటి నష్టం లేదు. పార్టీకి ఎల్లప్పుడు అండగా నిలబడుతున్న కార్యకర్తలలో నుండే సమర్దులయిన నాయకులను తయారుచేసుకోగల శక్తి నాకుంది. అందువలన ఒక నేత బయటకు వెళ్లిపోతే వందమంది నేతలను తయారు చేసుకొనే శక్తి, అవకాశం నాకుంది. తెలంగాణాలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తప్పకుండా విజయం సాధించే విధంగా పార్టీని తీర్చిదిద్దుతాను. త్వరలోనే ఖమ్మం జిల్లాలో మరియు ఇతర తెలంగాణా జిల్లాలో కూడా నేను పర్యటించి పార్టీ కార్యకర్తలతో, స్థానిక నేతలతో మాట్లాడుతాను,” అని అన్నారు.
చంద్రబాబు స్పందన అందరూ ఊహించిందే. కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన, తెలంగాణకు సమయం కేటాయించగలరా లేదో అనుమానమే. ఒకవేళ చెప్పినట్లుగానే ఆయన తెలంగాణాలో తరచూ పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకోగలిగితే మంచిదే. కానీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తెదేపాను పూర్తిగా ఖాళీ చేసేస్తామని పదేపదే చెపుతున్న అధికార తెరాస పార్టీ చూస్తూ ఊరుకొంటుందని భావించలేము. కనుక ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పర్యటించగలిగినట్లయితే, అప్పుడు తెరాస కూడా తప్పకుండా ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయడం తధ్యమని చెప్పవచ్చును.



.jpg)
.jpg)

.webp)



