విద్యుత్ పంపకాలపై ముందుకేనంటున్న బాబు

posted on: Jun 20, 2014 11:36AM

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ.జెన్.కో. విద్యుత్ పంపకాల ఒప్పందాల రద్దుకు చేసిన అభ్యర్ధనను ఈ.ఆర్.సి. తిరస్కరించినప్పటికీ, ఈవిషయంలో వెనక్కి తగ్గకూడదని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై చంద్రబాబు స్వయంగా కేంద్రానికి లేఖ వ్రాయడమే కాకుండా, త్వరలో డిల్లీ వెళ్ళినప్పుడు స్వయంగా ప్రధానమంత్రి మరియు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రితో ఈవిషయం గురించి మాట్లాడాలనుకొంటున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర విభజనలో అన్నిటినీ జనాభా ప్రాతిపదికన విభజించినపుడు విద్యుత్ కేటాయింపులు మాత్రం వినియోగం ఆధారంగా కేటాయించడాన్ని చంద్రబాబు తప్పుపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో రెండు ప్రాంతాల మధ్య జరిగిన ఈ విద్యుత్ కేటాయింపుల ఒప్పందాలలో ఏ ప్రాంతానికి ఎంత నిర్దిష్ట విద్యుత్ కేటాయించాలనే అంశం పేర్కొనబడలేదని, కానీ తెలంగాణా ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. సమైక్యరాష్ట్రంలో జరిగిన ఈ విద్యుత్ పంపిణీ ఒప్పందాలకు రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమీషన్ ఆమోదం తెలుపలేదనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసారు.

 

ఇక ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ.జెన్.కో. కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తోంది. విద్యుత్ శాఖ నియమనిబందనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే ఆయా రాష్ట్రాలలో ఉండే స్థానిక లోడ్ డిస్పాచ్ కేంద్రాలు విద్యుత్ పంపిణీ చేయవలసి ఉంటుందని, అందువల్ల వాటి ప్రతిపాదనలను ఈ.ఆర్.సి. ఆమోదించడం కేవలం లాంఛన ప్రాయమేనని, అటువంటప్పుడు ఆ ప్రతిపాదనలను తిరస్కరించదానికి కూడా వీలులేదని వాదిస్తునట్లు సమాచారం. ఏమయినప్పటికీ ఉభయరాష్ట్రాల విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర కార్యదర్శులు అవసరమయితే ముఖ్యమంత్రులు చర్చించుకొని ఇటువంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయడం మంచిది.

google-ad-img
    Related Sigment News
    • Loading...