కొండను తవ్వి ఎలుకను పట్టిన రాజధాని కమిటీ

posted on: Jun 10, 2014 12:11PM

 

 

 

 

యూపీఏ ప్రభుత్వం ఏదయినా ఒక క్లిష్టమయిన అంశాన్ని పరిష్కరించవలసి వస్తే, ముందుగా దానికొక ఒక కమిటీ వేసి చేతులు దులుపుకొనేది. అందుకు ఉదాహరణగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని చెప్పుకోవచ్చును. దాదాపు రూ.60కోట్లు పైగా ఖర్చుచేసి రాష్ట్రవిభజనపై ఆ కమిటీ తయారు చేసిన నివేదికను చెత్తబుట్టలో పడేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తరువాత చాలా హడావుడిగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన యూపీఏ ప్రభుత్వమే స్వయంగా రాజధాని ఎక్కడ ఏర్పరచాలో నిర్ణయం తీసుకొని ఉండవచ్చును. కానీ ఆవిధంగా చేసినట్లయితే, మిగిలిన ప్రాంతాలలో ప్రజలు తమ పార్టీని తరిమి కొడతారని భయపడి దానికీ ఒక కమిటీని వేసి చేతులు దులుపుకొంది.

 

ఆ కమిటీ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటించి వివరాలు సేకరించింది. అందుకు ఎన్ని లక్షలు ఖర్చయ్యాయో తెలియదు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మీడియాతో మాట్లాడుతూ విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలనుకొంటున్నట్లు ప్రకటించడంతో వారి పని కొండను తవ్వి ఎలుకని పట్టినట్లయింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చెప్పట్టగానే కేంద్రానికి గుదిబండగా మారిన ఇటువంటి అనేక జీ.ఓ.యం.(కమిటీ)లను రద్దు చేసి, తిరిగి కేంద్రమంత్రి వర్గానికే సర్వాధికారాలు కట్టబెట్టారు.

 

ఆవిధంగా చేయడం వలన మంత్రులు త్వరగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ఖజానాపై భారం తగ్గుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్రంలో అదే పద్ధతి అవలంభిస్తే బాగుంటుంది. అనవసరమయిన కమిటీలను రద్దు చేసి, కొన్ని మంత్రిత్వ శాఖలను, ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు క్రిందకు తీసుకు రాగలిగితే ప్రభుత్వంపై కొంత ఆర్ధికభారం తగ్గించుకోవచ్చును. అదేవిధంగా పార్టీలో అందరినీ సంతృప్తి పరిచేందుకు అందరికీ మంత్రి పదవులు లేదా నామినేటడ్ పదవులో కల్పించే ఆలోచన కూడా విరమించుకొంటే బాగుంటుంది. ప్రతీసారి ప్రజలనే త్యాగాలు చేయమని కోరకుండా మంత్రులు, పార్టీ నేతలు కూడా స్వయంగా కొన్ని త్యాగాలు చేసి, రాజధాని నిర్మాణం కోసం భారీగా విరాళాలు ఇచ్చినట్లయితే వారిని చూసి ప్రజలు కూడా మరింత స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...