చంద్రబాబు బీసీ మంత్రం ఫలిస్తుందా?

 

రాష్ట్ర విభజన వ్యవహారంలో తెలంగాణాలో బాగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీని తిరిగి బలపరిచేందుకు చంద్రబాబు మళ్ళీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణా ఏర్పాటుతో మంచి జోరు మీదున్న కాంగ్రెస్, తెరాసలపై పైచేయి సాధించేందుకు ఆయన మొట్ట మొదటగా చేసిన ‘బీసీ ముఖ్యమంత్రి’ ప్రతిపాదనతో ఊహించినట్లే ఆ రెండు పార్టీలలో కలకలం చెలరేగింది. అందుకే కేంద్రమంత్రి జైరామ్ రమేష్ తమ పార్టీ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హడావుడిగా ప్రకటించి ఆనక నాలుక కరుచుకొన్నారు. అయితే, కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులెవరూ చంద్రబాబు ఉచ్చులో పడలేదు, పైగా మాటల మాంత్రికులైన వారందరూ పోలవరం, ఉద్యోగులు, నదీ జలాల పంపకాలు తదితర సున్నితమయిన అంశాలను లేవనెత్తి దానిపై తెదేపా వైఖరి ఏమిటో చెప్పమని నిలదీస్తూ చంద్రబాబునే ఇరుకున పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. కానీ, చంద్రబాబు కూడా వారి కంటే రెండాకులు ఎక్కువే చదివారు. అందుకే బీసీ, యువ మంత్రాలు జపిస్తున్నారిప్పుడు. ఆయన రెండు రోజుల క్రితం బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యి వారికి 50శాతం టికెట్స్ ఇస్తానని హామీ ఇచ్చి వారిని తెదేపా వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు.

 

త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ బి.సి. సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తన అనుచరులతో కలిసి తెదేపాలో చేరబోతున్నట్లు సూచన ప్రాయంగా ప్రకటించారు. ఆయననే తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిని చేస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ, పార్టీకి ఇంతకాలం సేవ చేసిన వారిని కాదని కొత్తగా పార్టీలో చేరుతున్న ఆయనను ముఖ్యమంత్రిని చేస్తారని భావించలేము. అలా చేసినట్లయితే చంద్రబాబు ఒక సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించి మరో కొత్త సమస్యను సృష్టించుకొన్నట్లవుతుంది గనుక అటువంటి ఆలోచన చేయకపోవచ్చును.

 

ఈసారి ఎన్నికలలో బీసీలను, యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు గనుక సఫలమయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ తెలంగాణాలో పుంజుకోవచ్చును. ఒకవేళ తెదేపా-బీజేపీల మధ్య ఎన్నికల పొత్తులు ఖరారు అయినట్లయితే, అప్పుడు తెదేపా మరింత బలడుతుంది. అప్పుడు పోటీ ప్రధానంగా తెరాస, తెదేపా-బీజేపీ కూటమిల మధ్యనే జరుగుతుంది గనుక కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో అధికారం చెప్పట్టడం కోసం కాక, మూడో స్థానం కోసం పోటీ చేసే దుస్థితికి దిగజారవచ్చును. రాష్ట్ర విభజన చేసి బీజేపీ, తెదేపా, తెరాసలను దెబ్బతీద్దామని దురాలోచన చేసి అంధ్రాలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చంద్రబాబు ప్రయోగిస్తున్న బీసీ ఆయుధం, కేసీఆర్ ప్రయోగిస్తున్న తెలంగాణా సెంటిమెంటు దెబ్బకీ తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆశ్చర్యం లేదు.