చంద్రబాబు ఓర్పుకు హేట్సాఫ్
posted on May 6, 2015 11:24PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలోని రాజనీతిజ్ఞతను చూస్తుంటే ఆయన మీద గౌరవం పెరుగుతూ వుంటుంది. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక విజయాలు సాధించిన ముఖ్యమంత్రిగా, తెలుగువారి జీవితాలను మేలు మలుపు తిప్పిన నాయకుడిగా ఆయన ఎలా ఎదగగలిగారో అర్థమవుతూ వుంటుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు... ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో బాగా తెలిసిన రాజకీయవేత్త ఆయన. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోనే గౌరవప్రదమైన రాజకీయ నాయకులలో ఒకరిగా పేరు తెచ్చుకోగలిగారు.
ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి గల ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం విషయంలో చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ఓర్పు. ఆర్థికంగా ఎంతో క్రుంగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఒకప్పుడు తన మాటతో దేశ రాజకీయాలను శాశించిన ఆయన ఇప్పుడు కేంద్రం ముందు ఎంతో ఓర్పుతో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ఎన్నో అంశాల విషయంలో కేంద్రం కొంత జాప్యం చేస్తున్నప్పటికీ, అది ఎంతోమందికి ఆవేశాన్ని కలిగిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఎంతమాత్రం ఓర్పును కోల్పోకుండా కేంద్రంతో సత్సంబంధాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్న స్థానంలో మరో వ్యక్తి ఉన్నటయితే కేంద్రం మీద నిప్పులు చెరిగి, విమర్శలు గుప్పించి పరిస్థితిని మరింత నాశనం చేసి వుండేవారు. అయితే చంద్రబాబు మాత్రం కేంద్రం మీద ఎలాంటి విమర్శలు చేయకుండా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావలసిన నిధులను, వరాలను సాధించేందుకు ప్రయత్నం చేస్తు్న్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడం ఆలస్యమైందని కేంద్రం మీద వాగ్బాణాలు సంధిస్తున్న కొంతమంది ఏపీ నాయకులు చంద్రబాబును చూసయినా పాఠాలు నేర్చుకోవాలి. ఆయన ఓర్పుకు హేట్సాప్ చెప్పాలి.