చండీయాగంలో అగ్నిప్రమాదం అరిష్టమా?

posted on: Dec 27, 2015 9:08PM



తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అయుత మహా చండీయాగం ఐదు రోజుల పాటు వైభవంగా జరిగింది.ఈ యాగంలో సామాన్య ప్రజానీకంతోపాటు దేశంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ యాగంలో పాల్గొనడం విశేషం. శృంగేరి పీఠానికి చెందిన రుత్వికులు ఈ యాగాన్ని ఆద్యంతం వైభవంగా నిర్వహించారు. యాగం సందర్భంగా ఏర్పాట్లు కూడా బాగా జరిగాయి. అంతా బాగానే జరిగిందికానీ, యాగం చివరి రోజైన ఆదివారం నాడు మాత్రం యాగశాలకు నిప్పు అంటుకుని బూడిదైపోయింది. యాగశాలలో వున్నవారు భయభ్రాంతులకు గురై యాగశాల నుంచి బయటకి వెళ్ళిపోవడంతో యాగానికి ఒక గంటపాటు  అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం చాలా సంతోషించాల్సిన విషయం. భారీ స్థాయిలో మంటలు రేగినప్పటికీ ఎవరికీ ఎలాంటి నష్టం జరకపోవడం కూడా యాగ మహిమ కూడా భావించడం న్యాయమే. అయితే కొంతమంది విమర్శకులు మాత్రం చండీయాగం సందర్భంగా అగ్నిప్రమాదం జరగడం అరిష్టమనే వాదనను పైకి తీసుకుని వస్తున్నారు. చండీయాగం కేసీఆర్ వ్యక్తిగతంగా చేస్తున్న యాగం కాబట్టి ఆయనకే అరిష్టమని కొంతమంది అంటూ వుంటే, తెలంగాణ వచ్చిన సందర్భంగా చేసిన యాగం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికే అరిష్టమని మరికొందరు కొత్త భాష్యాలు చెబుతున్నారు.

కేసీఆర్ ఒక మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ చండీయాగం చివరిరోజున ఏదో ఒక చిన్న అపశ్రుతి జరిగినంత మాత్రాన అది అరిష్టానికి సంకేతమని వ్యాఖ్యానించడం మంచిది కాదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ శారదా పీఠ అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. యాగశాల కాలిపోవడం శుభసూచకమేనని ఆయన చెప్పారు. ఇది ఈ విషయంలో చెలరేగుతున్న విమర్శలకు అడ్డుకట్ట వేసే అవకాశం వుంది. సహజంగా భారీగా యాగాలు నిర్వహించిన అనంతరం యాగం కోసం నిర్మించిన పాకలను కాల్చివేయడం సంప్రదాయం. ఇప్పుడు యాగం ముగియడానికి కొన్ని గంటల ముందే పాకలు వాటంతట అవేకాలిపోయాయి. దీనిని చండీమాత కరుణగానే భావించాల్సి వుంటుందని స్వరూపానందేంద్ర సరస్వతి చెబుతున్నారు. కేసీఆర్ చండీయాగాన్ని అద్భుతంగా నిర్వహించారు కాబట్టే చండీమాత కరుణించి కాస్తంత ముందుగానే యాగశాలను దగ్ధం చేసిందని భావించవచ్చు. ఇది నిజంగానే ఒక శుభసూచకం. యాగం ముగియకముందే శుభసూచకం కనిపించింది. ఇక ముందుముందు మరిన్ని శుభాలు జరుగుతాయని ఆశించవచ్చు.

google-ad-img
    Related Sigment News
    • Loading...