Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్రా మేదావి... ఆటలో అరటిపండు అవుతారా?
posted on: Sep 8, 2016 4:35PM
.jpg)
ఆయన దేవదాసులా వుంటాడు! కాని, పాపం ఆయనది లవ్ ఫెయిల్యూర్ కాదు! భుజాన శాలువా వేసుకుని భోరున తన్నుకొస్తున్న ఏడుపును అణిచిపెట్టుకుని ఆయన టీవీ స్టూడియోల్లో తిరుగుతుంటాడు! అయినా ఆయన బాధ మీరనుకున్నట్టు తాళలేని విరహం కాదు! ఆయన ఉద్వేగమంతా, ఉక్రోషమంతా, నిర్వేదమంతా, నిర్లిప్తతంతా ఆంద్రప్రదేశే! అవును... ఆంధ్రుల అలుపెరగని, అందరికీ తెలిసిన, ఎవ్వరికీ అర్థం కాని, ఏకైక మేధావి... చలసాని శ్రీనివాస్! ఎవరీయన? ఏంటి ఆయన తహతహ? ఇవేనా మీ ప్రశ్నలు... నిజానికి మా కొశన్స్ కూడా అవే!
ఆంద్ర మేధావుల సంఘం తరుఫున కాలికి బలపం కట్టుకుని తిరిగే చలసాని వారి మహోన్నత ఉద్దేశ్యాల్ని ఎవ్వరం తప్పు పట్టలేం. తమ సంఘంలో మరో మేధావి ఎవరైనా వున్నారా లేదా అన్నది ఆయనకే తెలియాలి. కాని, ఆ విషయం పక్కన పెడితే... ఈ ఒంటరి ఆంధ్రా మేధావి అతనే ఒక సైన్యం అన్నట్టు పోరాటం చేస్తుంటాడు. తనను ఆస్థాన ప్యానలిస్టుగా పిలిచే టీవీ స్టూడియోలకి ఓపికగా వెళుతుంటాడు. ఒకప్పుడు రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా గళం విప్పేవాడు. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పరితపించిపోతున్నాడు. ఇది సంతోషకర విషయమే! కాని, ఇక్కడే చలసాని వారి మార్కు మేధావి ట్విస్ట్ వుంది!
చలసాని శ్రీనివాస్ డ్రెస్సింగ్, ఆయన వేసుకునే శాలువా ఎప్పుడూ ఒకేలా వుంటాయి! ఆయన ముఖంలోని బాధాతప్త ఎక్స్ ప్రెషన్ కూడా ఏ మాత్రం మారదు! కాని, ఆయన అభిప్రాయాలే పదే పదే మారిపోవటంతో ఆంద్ర ప్రజలు అవాక్కైపోతున్నారు! తెలంగాణ ఏర్పాటు సందర్భంగా మన మీడియా ఛానళ్లు చర్చల పేరుతో వీరంగం వేస్తుంటే ఈయన జై అంధ్రా అంటూ వెళ్లేవాడు. దాంతో చలసాని తమకు పనికొస్తాడని కొంత కాలం తెలంగాణ వాదులు కూడా భ్రమపడ్డారు. కాని, ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిందే కాని హైద్రాబాద్, నది జలాలు, ఉద్యోగాలు, నిధులు వగైరా వగైరా అంటూ ఉపన్యాసాలు ఇచ్చాడు. చివరకు, జై అంధ్రా అంటూ మొదలు పెట్టిన మన మేధావి సార్ సమైక్యాంధ్ర ఉద్యమకారులతో అన్ని మీటింగుల్లో పాల్గొన్నాడు. తెలంగాణ వ్యతిరేకిగా తెలంగాణ వాదుల ముందు బుక్కయ్యాడు. పోనీ ఇటు ఆంధ్ర ప్రజలు ఏమైనా ఈ శాలువా సార్ ని శాలువా కప్పి సత్కరించారా అంటే... ఆయన వాదనేంటో అర్థం కాక అలా వదిలేశారు!
రాష్ట్రం రెండు ముక్కలై ఇప్పుడు ప్రత్యేక హోదా రాద్ధాంతం నడుస్తోంటే... చలసాని , ది మేధావి, అలుపెరుగక మరోసారి ఉద్యమం మొదలుపెట్టాడు! ఈ సారి కూడా ఆయనతో అదే ప్రాబ్లం. ఆయన ఏం చెబుతున్నాడో, ఎవరికి చెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో ఏమీ అర్థం కాదు. ఆయన్ని పిలిచి కూర్చోబెట్టే టీవీ చర్చాసురులకైనా తెలుసో... లేదో!
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. ఈ ముక్క చెప్పటానికి చలసాని అంతటి మేధావి ఎందుకు? ఎవరైనా చెబుతారు! బీజేపి ఇవ్వటం లేదు. ఆ పార్టీ ఈయన మాట వినేలా ఆంద్ర మేధావుల సంఘం తరుఫున ఏం చేస్తున్నాడు? అది ఆ సెగని ఎదుర్కొంటోన్న మోదీకి తెలియాలి! సాయంత్రం టీవీ చర్చలు సరే... పొద్దున్నంతా చలసాని వారి ఉద్యమ కార్యాచరణ ఏంటి? ఇది ఎవ్వరికీ తెలియదు! ఆయన ప్రత్యేక హోదా తెచ్చే బాద్యత భుజాన వేసుకున్నానంటాడు కాని... భుజం పై శాలువా తప్ప క్లారిటీ అస్సలు కనిపించదు!
చలసాని శ్రీనివాస్ ను ఒక మహా మేధావిగా... ఆయన గతంలో ఏం సాధించాడో పెద్దగా తెలియకున్నా... ఆంధ్ర ప్రజలు చక్కగా గౌరవిస్తారు. మీడియా సాక్షిగా ఇది అనుమానం అక్కర్లేని సత్యం! కాకపోతే, ఇప్పుడు ప్రత్యేక హోదా రాలేదని కుంగిపోతోన్న తెలుగు ప్రజల బాధంతా ఒక్కటే... ఢిల్లీలోని కేంద్రంతో సాగోతోన్న ఈ మహా కురుక్షేత్రంలో చలసాని ఇంకెంత కాలం యుద్ధం చేస్తాడు? అదీ... గాల్లో కత్తి తిప్పుతూ... తనకు తానే సృష్టించుకున్న పద్మవ్యూహంలో చిక్కుకుని... రాజకీయ పెద్దలెవ్వరూ పట్టించుకోకుండా... ఎంత కాలం పోరాడతాడు? చివరకు, కొంపదీసి... ఈ నిఖార్సైన నిజాయితీగల టీవీ స్టూడియోల తాలూకూ మేదావి... ఆటలో అరటిపండు అయిపోడు కదా? శ్రీనివాసా... గోవింద!


.jpg)



