పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. భారత నావికుల భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం.!

posted on: Jul 15, 2026 10:18AM

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ పరివాహక ప్రాంతంలోని భారత నావికుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం   కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ పరిధిలో వివిధ నౌకలపై విధులు నిర్వర్తిస్తున్న  భారత సిబ్బందికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి, నిరంతరం పర్యవేక్షించాలని నిర్ణయించింది. 

 ఈ మేరకు  కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్షియన్‌ గల్ఫ్‌, హర్మూజ్‌ జలసంధి, ఒమన్‌ గల్ఫ్‌ వంటి సున్నితమైన సముద్ర మార్గాల్లో ప్రయాణించే వాణిజ్య నౌకల కదలికలను ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక రియల్ టైమ్ ఆపరేషనల్ డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించాలని నిర్దేశించారు. 

ఈ నూతన డ్యాష్‌బోర్డ్ ద్వారా సముద్రంలో ప్రయాణిస్తున్న నౌకల ప్రస్తుత లొకేషన్, వాటి యాజమాన్య వివరాలు, లోడ్ చేసిన సరకు, అందులోని మొత్తం సిబ్బందితో పాటు ప్రయాణించే మార్గం వంటి వివరాలు నిరంతరం అప్‌డేట్ అవుతుంటాయి. ముఖ్యంగా సదరు నౌక ఏ దేశ పతాకంతో ప్రయాణిస్తున్నప్పటికీ, అందులో పనిచేస్తున్న భారతీయుల క్షేమ సమాచారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ తరహా దాడుల వల్ల   భారత నావికులు ప్రాణాలు కోల్పోవడం,   గాయపడటం పట్ల మంత్రి సోనోవాల్‌  ఆవేదన వ్యక్తం చేశారు. గ్లోబల్ సప్లై చైన్  నిరంతరాయంగా సాగడంలో భారత నావికులు పోషిస్తున్న పాత్ర అమూల్యమైనదని, వారి భద్రతకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

 రక్షణ చర్యలను  వేగవంతం చేసేందుకు విదేశాంగ శాఖతో పాటు ఇరాన్, ఒమన్, యూఏఈలలోని భారత రాయబార కార్యాలయాలతో సమన్వయాన్ని పెంచుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నౌకాయానంలో తలెత్తే అత్యవసర పరిస్థితులు, ప్రత్యామ్నాయ ఓడరేవుల లభ్యత, తక్షణ వైద్య సహాయం,  నావికులను సురక్షితంగా స్వదేశానికి తరలించే అంశాలపై ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు.

మరోవైపు, గల్ఫ్ దేశాల పరిధిలో భారతనావికులను విధుల్లోకి తీసుకున్న రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు, షిప్పింగ్ మేనేజ్‌మెంట్ కంపెనీలు తమ వద్ద ఉన్న సిబ్బంది నివేదికలను తక్షణమే ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నావికులకు పూర్తి స్థాయి భద్రతతో పాటు అత్యవసర సాయం అందేలా చూసే ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విధులకు పంపకూడదని కేంద్రం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.

West Asia tensions, Persian Gulf ship tracking, Sarbananda Sonowal, Strait of Hormuz security

google-ad-img
    Related Sigment News
    • Loading...