ఏపీకి మరో వెయ్యి కోట్లు?

 

అడిగితే గానీ అమ్మ కూడా అన్నం పెట్టదని ఎవరు అన్నారో గానీ అది అక్షరాల కేంద్రప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుంది. బడ్జెట్ పై అనేక ఆశలు పెట్టుకొన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికీ, ప్రజలకు కూడా కేంద్రం బడ్జెట్ లో పెద్ద షాక్ ఇవ్వడంతో వారి ఆగ్రహం ఎలా ఉంటుందో కేంద్రం రుచి చూడవలసి వచ్చింది. పార్లమెంటు సమావేశాలలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎన్డీయే ప్రభుత్వాన్ని రోజూ కడిగిపడేస్తుంటే, రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, మీడియా మూకుమ్మడిగా బీజేపీకి, ఎన్డీయే ప్రభుత్వానికి తలంటేస్తున్నారు. దానితో దిగివచ్చిన కేంద్రం హడావుడిగా రాష్ట్రానికి మరో వెయ్యి కోట్లు అధనంగా విడుదల చేసేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం.

 

కానీ రాష్ట్ర బడ్జెట్ లోటే వేల కోట్లు దాటిపోయున్నప్పుడు ఇప్పుడు అదనంగా మరో వెయ్యి కోట్లు విదిలించినంత మాత్రాన్న రాష్ట్రం ఒడ్డున పడుతుందా? ఇంత అరిచి గ్గీ పెట్టిన తరువాత మరో వెయ్యి కోట్లు విదిలిస్తున్న కేంద్రం, లక్షల కోట్లు వ్యయం అయ్యే పోలవరం ప్రాజెక్టు, రాజధాని, మెట్రో రైల్, అనేక ఉన్నత విద్యా వైద్య సంస్థలు, విమానాశ్రయాల నిర్మాణం కోసం ఎప్పుడు ఎంత ఇస్తుందో ఎవరికీ తెలియదు. కనుక కేంద్రంపై భారీ ఆశలు పెట్టుకోవడం వలన ఇదేవిధంగా తీవ్ర నిరాశ, నిస్పృహలే తప్ప మరేమీ ఉండక పోవచ్చును.