సీనియర్ ఐఏఎస్ అర్వింద్ కుమార్ విచారణకు కేంద్రం అనుమతి.. కేటీఆర్ కు చిక్కులు తప్పవా?

posted on: Feb 17, 2026 4:26PM

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా ఆపార్టీ నేతలంతా ఫార్ములా ఈ రేస్ కేసును లొట్టపీసు కేసు అంటూ ఎంతగా తక్కువ చేసి మాట్లాడాలని చూసినా అది గట్టి కేసేనని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్ కు కేంద్రం అనుమతి లభించింది. ఈ కీలక పరిణామంతో తెలంగాణ ఏసీబీ ఫార్ములా ఈ  రేసు విచారణను మరింత వేగవంతంచేయడానికి రెడీ అయిపోయింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఎప్పుడో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే కేసులో అర్వింద్ కుమార్ విచారణకు కేంద్రం నుంచి అనుమతి లభించడంతో ఇక ఏ క్షణంలోనైనా ఆయనను విచారణకు పిలవడం, ఈ కేసులో చార్జిషీట్ దాఖలు కావడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ను విచారించేందుకు కేంద్రం నుంచి అనుమతి లభించిన వెంటనే ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.  రూ.54.88 కోట్ల ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థలకు తరలించడంలో అర్వింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా కేటీఆర్ ఆదేశాల మేరకు క్యాబినెట్ ఆమోదం లేకుండానే దస్త్రాలను వేగంగా కదిలించారని ఏసీబీ ఆరోపిస్తోంది.

ఈ లావాదేవీల వల్ల ప్రభుత్వ ఖజానాకు కేవలం నిధుల పరంగానే కాకుండా, జరిమానాల రూపంలోనూ భారీ నష్టం వాటిల్లిందని ఏసీబీ   ఆధారాలు సేకరించింది. అదలా ఉంటే.. ఈ కేసులో అర్వింద్ కుమార్ అప్రూవర్ గా మారే అవకాశాలపై రాజకీయ, అధికార వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  కెరీర్ , భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే.. ఈ కేసులో తాను   పైస్థాయి ఆదేశాలను  అమలు చేశానని చెబుతూ, అసలు సూత్రధారుల వివరాలను వెల్లడించేందుకు ఆయన సిద్ధమయ్యే అవకాశం మెండుగా ఉన్నాయంటున్నారు. అదే జరిగితే.. ఈ కేసులో ఏ1  కేటీఆర్‌కు ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు అంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...