కేంద్ర మంత్రి పదవి.. గవర్నర్ పోస్టు.. తెలుగుదేశంకు కేంద్రం ఆఫర్?!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి కేంద్రంలో ఉన్న పలుకుబడి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇలా అడిగితే.. అలా కేంద్రం అనుమతులు మంజూరు చేస్తోంది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సర్కార్ మనుగడకు తెలుగుదేశం మద్దతు అత్యంత కీలకం కనుక మాత్రమే ఈ పలుకుబడి అనుకోవడానికి వీలు లేదు. చంద్రబాబు దార్శనికత.. దేశ ప్రగతికి ఆయన సలహాలు అత్యంత ముఖ్యమని కేంద్రం పెద్దలు భావిస్తుండటమే అందుకు కారణమని పరిశీలకులు అంటున్నారు. 

ఇక తాజాగా కేంద్రం వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. కేంద్రం తెలుగుదేశం పార్టీకి మరో రెండు కీలక పదవులను కట్టబెట్ట నుంది. అవేంటంటే బీహార్ ఎన్నికల తరువాత జరగనున్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగుదేశం కు మరో మంత్రి పదవి. అంటే ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో ఇద్దరు తెలుగుదేశంకు చెందిన వారు ఉన్నారు. అదనంగా మరో మంత్రిపదవిని కూడా తెలుగుదేశంకు ఇచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా.. ఒక రాష్ట్రానికి గవర్నర్ గా కూడా తెలుగుదేశం కు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కేంద్రం వర్గాలు అంటున్నాయి.  ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ప్రధాని మోడీ చర్చించినట్లు సమాచారం. 

ఇటీవలే  కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి   అశోక్ గజపతి రాజును గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సీనియర్ నేతను మరో  రాష్ట్రానికి గవర్నర్ గా నియమించనున్నట్లు తెలుస్తోంది.  దీంతో ఇప్పడు అంటే బీహార్ ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం మరో రెండు కీలక పదవులను తెలుగుదేశంకు ఆఫర్ చేయనున్నది. అయితే ఆ పదవులకు చంద్రబాబు ఛాయస్ ఎవరై ఉంటారన్నచర్చ ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. తెలుగుదేశం వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు  తెలుగుదేశం నుంచి గవర్నర్ పదవి కోసం రేసులో ఇద్దరు సీనియర్ నాయకులు ఉన్నారు. ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. వారిలో ఒకరు మాజీ మంత్రి, మాజీ స్పీకర్ అయిన యనమల రామృష్ణుడు కాగా మరొకరు మాజీ మంత్రి కేఈకృష్ణమూర్తి. ఈ ఇరువురూ కూడా చంద్రబాబుకు సన్నిహితులే. ఈ ఇరువురిలో చంద్రబాబు కేఈ కృష్ణమూర్తివైపే మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్ గా ఉన్నారు. కనుక ఇప్పుడు రాయల సీమకు చెందిన కేఈ కృష్ణమూర్తికి అవకాశం ఇస్తే.. సామాజిక సమీకరణలతో పాటు ప్రాంతీయ సమతుల్యం కూడా పాటించినట్లు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక యనమనలను అయితే రాజ్యసభకు పంపించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఇక కేంద్ర మంత్రి పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై పార్టీ సీనియర్లలో ఆయన సమాలోచనలు జరుపుతున్నారని అంటున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu