వెండిపై కేంద్రం ఆంక్ష‌లు...అసలు కారణం ఇదేనా?

posted on: May 19, 2026 4:22PM

 

బంగారం, వెండి.. ఈ రెండూ భారతీయులకు కేవలం లోహాలు మాత్రమే కాదు, మన భార‌తీయ‌ సంస్కృతిలో భాగం మాత్ర‌మే కాదు... ఈ  మెట‌ల్స్, అత్యంత నమ్మకమైన పెట్టుబడులు కూడా. అయితే, గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులు, కొనుగోళ్లు నిల్వలపై నిబంధనలను కఠినతరం చేస్తోంది.

ఇటీవల వెండిపై ఆంక్షలు విధించడం, ఇదివరకే బంగారంపై హాల్‌మార్కింగ్, పాన్ కార్డ్ పరిమితులు వంటి రూల్స్ తీసుకురావడం వెనుక కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన వ్యూహం, ఆలోచన ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

బంగారంపై ఇప్పటికే ఉన్న రూల్స్ ఎలాంటివో చూస్తే.. కచ్చితమైన హాల్‌మార్కింగ్ ఏర్పాటు. ఇది ఎందుకంటే నకిలీ బంగారానికి అడ్డుకట్ట వేయడానికి సిక్స్-డిజిట్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌తో కూడిన హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది కేంద్రం.

రూ. 2 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని నగదు రూపంలో కొనాలంటే పాన్ కార్డ్  తప్పనిసరి. అలాగే రూ.50 వేలు దాటితే కేవైసీ నిబంధనలు వర్తిస్తాయి. ఇంట్లో ఐటీరైడ్స్ జరిగినప్పుడు లెక్క చూపని బంగారం ఎంత ఉండవచ్చనే దానికి పరిమితులు ఉన్నాయి. వివాహిత మహిళకు 500 గ్రాములు, అవివాహిత మహిళకు 250 గ్రాములు, పురుషులకు 100 గ్రాములు బంగారం  ఉండొచ్చు.

వెండిపై తాజా ఆంక్షలు / నిబంధనలు ఎలాంటివో ప‌రిశీలిస్తే.. వెండి దిగుమతుల్లో జరుగుతున్న అక్రమాలను.. ముఖ్యంగా కొన్ని దేశాలతో ఉన్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను - FTA దుర్వినియోగం చేస్తూ తక్కువ సుంకంతో దిగుమతి చేసుకోవడం వంటి నిబంధ‌న‌లు తీసుకొచ్చింది. వెండిని కూడా పారదర్శకమైన లీగల్ ఛానెల్స్ ద్వారానే ట్రేడింగ్ జరిగేలా పర్యవేక్షణ పెంచుతోంది.

బంగారం, వెండి విషయాల్లో కేంద్రం ఇంత కఠినంగా వ్యవహరించడం వెనుక ప్రధానంగా 3 బలమైన కారణాలు ఉన్నాయి. భారతదేశం తన దేశీయ అవసరాల కోసం అత్యధికంగా బంగారాన్ని, వెండిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల మన దేశ కరెన్సీ విలువ తగ్గి, విదేశీ మార్పిడి నిల్వలు కరిగిపోతాయి. దిగుమతులపై ఆంక్షలు లేదా సుంకాలు విధించడం ద్వారా విదేశాలకు తరలిపోయే మన దేశ సంపదను నియంత్రించడం కూడా ఒక భాగ‌మే. 

బంగారం, వెండి రంగాల్లో చాలా కాలంగా అప్రకటిత నగదు, అంటే నల్లధనం పెట్టుబడిగా మారుతోంది. చాలామంది తమ దగ్గర ఉన్న అక్రమ సంపాదనను బంగారం, వెండి బిస్కెట్ల రూపంలో దాచుకుంటారు.
ప్రతీ గ్రాము కొనుగోలును డిజిటలైజ్ చేయడం, పాన్ కార్డ్ లింక్ చేయడం ద్వారా మనీ లాండరింగ్‌కు అడ్డుకట్ట వేయడం. అలా జ‌ర‌గాలంటే ప్రతి లావాదేవీ ప్రభుత్వ రికార్డుల్లో ఉండాలి. ఇదే కేంద్ర ప్ర‌భుత్వ ఆలోచ‌న‌.

భారతీయులు బంగారాన్ని కొని ఇళ్లల్లో లేదా లాకర్లలో పెట్టేస్తారు. ఇందువల్ల ఆ డబ్బు మార్కెట్లోకి రాకుండా డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ గా మారిపోతుంది. భౌతిక బంగారానికి బదులుగా ప్రజలు సావరిన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించడం. దీనివల్ల ప్రజలకు లాభం ఉంటుంది, ప్రభుత్వం దగ్గర నిధులు ఉండి దేశ ప్రగతికి వాడుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వ అంతిమ లక్ష్యం ఒక్కటే...  బంగారం, వెండి మార్కెట్లను పూర్తి పారదర్శకంగా మార్చడం.. త‌ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. సాధారణ ప్రజలు తమ ఇంట్లో పెట్టుకునే నగలు లేదా పెళ్లిళ్ల కోసం కొనే వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, వ్యాపారాల పేరిట ట్యాక్స్ ఎగవేసే వారికి, కోట్ల రూపాయల నల్లధనాన్ని బంగారంలో దాచే వారికి మాత్రం ఈ రూల్స్ గట్టి చెక్ పెడుతున్నాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...