ఏపీలో జనగణన షురూ

posted on: Apr 16, 2026 10:09AM

ఆంధ్రప్రదేశ్ లో భారత జనగణన-2027 ప్రక్రియ గురువారం (ఏప్రిల్ 16)నుంచి అధికారికంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక సేకరణగా గుర్తింపు పొందిన ఈ కార్యక్రమం, చరిత్రలో తొలిసారిగా పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నారు. తొలి దశలో  ఇంటి వివరాల సేకరణ , గృహ గణన పనులు చేపట్టారు.  రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె. నివాస్ అమరావతి సచివాలయంలో  బుధవారం (ఏప్రిల్ 15) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలోలా కాకుండా, ఈసారి ప్రజలకు  స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అనే వినూత్న సదుపాయాన్ని  అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.  

గురువారం (ఏప్రిల్ 16)  నుండి ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని వినియోగించుకోలేని వారి కోసం ఎన్యూమరేటర్లు నేరుగా ఇంటింటికీ వచ్చి సమాచారాన్ని సేకరిస్తారన్నారు.   డిజిటల్ విధానం వల్ల సమాచార సేకరణలో పారదర్శకత పెరుగుతుందన్నారు. 

ఈ కార్యక్రమం కోసం  గణన విధుల్లో పాల్గొనే వారిలో 80 శాతం మంది గ్రామ,  వార్డు సచివాలయ ఉద్యోగులే ఉండటం విశేషం. మిగిలిన 20 శాతం విధులను ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందికి కేటాయించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం నేరుగా డిజిటల్ సర్వర్లలో నిక్షిప్తం కానుంది. ప్రజలు అందించే వ్యక్తిగత వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయనీ, డేటా భద్రతపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. అయితే..  గణన ప్రక్రియలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించినా,  అధికారుల విధులకు ఆటంకం కలిగించినా  చర్యలు తప్పవని ఈ సందర్భంగా జె. నివాస్ హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనలో ఈ గణాంకాలు కీలక పాత్ర పోషిస్తాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన వివరాలు అందించాలని కోరారు.

రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ డేటా ఆధారంగానే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఏపీలో ప్రారంభమైన ఈ డిజిటల్ జనగణన ప్రక్రియ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా ఇదే తరహా విధానానికి ఇది ఒక రోడ్ మ్యాప్‌గా నిలిచే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...