ప్రతి పక్షం రోజులకూ అమరావతి పనుల పురోగతి సమీక్ష
posted on Nov 1, 2025 3:29PM

నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం విషయంలో ఇసుమంతైనా జాప్యాన్ని సహించబోనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ముందుగా నిర్ణయించిన నిర్దుష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి అవ్వాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతా అంశాలలో అమరావతి, పోలవరం ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలన్న సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పురోగతి విషయంలో అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అమరావతి పనులతో జాప్యం జరగడానికి ఎంత మాత్రం అంగీకరించనన్న ఆయన అవసరమైతే.. అదనపు సిబ్బందినీ, యంత్రాలనూ ఉపయోగించాలని సూచించారు. ప్రధాని మోదీకి ఇచ్చిన హామీ మేరకు పనుల్లో వేగం పెంచాలని ఆయన గుత్తేదారులకు కూడా ఈ సందర్భంగా సూచించారు. అక్కడితో ఆగకుండా.. ఇక నుంచి ప్రతి పక్షం రోజులకు ఒక సారి అమరావతి పనుల పురోగతిని సమీక్షిస్తానని చెప్పారు.