ఏపీలో జలమార్గాల అభివృద్ధి.. అరూప్ సంస్థకు చంద్రబాబు ఆహ్వానం

పెట్టుబడుల వేటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దూసుకుపోతున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్యంతో ఆయన తన లండన్ పర్యటనలోనూ నిర్విరామంగా పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా ఆయన సోమవారం (నవంబర్ 2)  ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఖనిజ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, వారిని రాష్ట్రానికి పెట్టుబడులతో రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెల 14, 15 తేదీలలో విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానించారు.  

ఆంధ్రప్రదేశ్ లో  రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పాటు   జలరవాణాకు ఉన్న అపార అవకాశాలను చంద్రబాబు వారికి వివరించారు.  తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసేందుకు వీలుగా జల మార్గాలను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని  ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ 'ఆరుప్'కు సూచించారు.  ఏపీని ఒక కీలకమైన లాజిస్టిక్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. 

అలాగే సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్ జెట్ ను మించిన వేగంతో పురోగమిస్తోందన్న చంద్రబాబు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుందనీ,  అమరావతిలో వచ్చే ఏడాది జనవరి నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఏఐ వినియోగం, నిపుణుల తయారీ, ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.

 ఇక రాష్ట్రంలో  భూగర్భ ఖనిజాల వెలికితీతలో యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు ఆ సందర్భంగా పిలుపునిచ్చారు.   ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరుప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, అల్తెరిన్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ వూలాండ్, పీజీ పేపర్ కంపెనీ సీఈఓ పూనమ్ గుప్తా, మాంచెస్టర్ యూనివర్సిటీ నానోసైన్స్ ప్రొఫెసర్ రాధాబోయా సహా పలువురు ప్రముఖులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu