చంద్రబాబు ఓ అద్భుతం.. ఆనంద్ మహేంద్ర
posted on Nov 19, 2025 5:08PM

మహీంద్ర అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ అనంద్ మహీంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను ఒక అద్భుతంగా అభివర్ణించారు. చంద్రబాబు పని తీరు, అభివృద్ధి కాముకత, దార్శనికత మాత్రమే కాకుండా ఆయన రూపొందించే విధానాలు కూడా గొప్పగా ఉంటాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా చంద్రబాబును ప్రశంసించడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా పలు సందర్భాలలో ఆయన నారా చంద్రబాబుపై పొగడ్తలు కురిపించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు తమ సంస్థ సిద్ధంగా ఉందని ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కారణంగా ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకతతో ఉన్నట్లు పేర్కొన్నారు.
అయితే ఈ సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించిన ఎస్క్రో వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. అలాగే రాష్ట్రానికి ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలన్న చంద్రబాబు దార్శనికతను అభినందించారు. దీర్ఘకాలంగా ఆయన నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిత్సున్న తీరు పట్ల తాను ముగ్థుడైనట్లు పేర్కొన్నారు. కాగా ఆనంద్ మహేంద్ర ట్వీట్ పై స్పందించిన చంద్రబాబు ఆయనకు కృతజ్ణతలు తెలిపారు. ఆయనను ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.