చంద్రబాబు.. పెను తుపాను సైతం తలవొంచిన నిప్పుకణం
posted on Oct 29, 2025 11:18AM

మొంథా తుపాను తీరం దాటింది. పెనుగాలులు, కుండపోత వర్షంతో కోస్తా జిల్లాలలన అతలాకుతలం చేసింది. మంగళవారం అర్థరాత్రి సమయంలో ఈ తుపాను తీరం దాటే ప్రక్రియ పూర్తయ్యింది. ఇక బలహీనపడుతుంది. అయితే దీని ప్రభావంతో మరో ఒకటి రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే దేశం మొత్తం ఈ తుపానును ఆంధ్రప్రదేశ్ ఎలా ఎదుర్కొంటుందా అని ఉత్కంఠతో ఎదురు చూసింది. ఎందుకంటే తుపాను తీవ్రత అంత భారీగా ఉంది మరి.
అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. పక్కా ప్రణాళిక, కచ్చితమైన ఆచరణ.. నిరంతర పరిశీలన, పర్యవేక్షణతో ఈ పెను తుపాన కారణంగా ప్రాణనష్టం జరగ లేదు. ఆస్తినష్టం కూడా కనిష్ట స్థాయిలోనే ఉంది. ఇందుకు చంద్రబాబు ముందు చూపు, తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలే కారణఏమని చెప్పకతప్పదు. సీఎం చంద్రబాబు స్వయంగా మంగళవారం (అక్టోబర్ 28) అర్థరాత్రి వరకూ పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఆయన పర్యవేక్షణ సమీక్షల కారణంగానే అధికారయంత్రాంగం అరహారం శ్రమించింది. ప్రభుత్వం ప్రజల కోసమే ఉందన్న విశ్వాసం కలిగేలా వ్యవహరించింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిరాఘాటంగా దాదాపు 12 గంటల పాటు ఆర్టీజీఎస్ నుంచి తుపాను పరిస్థితిని, ప్రజలకు యంత్రాంగం అందిస్తున్న సహాయ సహకారాలను పరిశీలించారు. పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలూ, ఆదేశాలూ ఇచ్చారు. దీంతో ప్రజలకు ఎక్కడ సాయం అవసరం అని సమాచారం వస్తే అక్కడకు అధికార యంత్రాంగం క్షణాల్లో చేరుకుంది. సమస్యలను వెంటనే పరిష్కరించింది. ముందు జాగ్రత్త చర్యలా వందల మందిని పునరావాస కేంద్రాలకు తరలించింది. ప్రమాదకరమైన రహదారులపై వాహనాల రాకపోకలనూ అనుమతించలేదు.
1995 - 1999 మధ్య చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు, జనబాహుల్యం కూడా.. ప్రజలకు ప్రయోజనం కలిగే పనుల విషయంలో అవి పూర్తయ్యే వరకూ చంద్రబాబు నిద్రపోరు.. అధికారులను నిద్రపోనివ్వరు అనే వారు. ఇదిగో ఇప్పుడు.. మొంథా తుపానును ఎదుర్కొనేందుకు చంద్రబాబు మళ్లీ నాటి చంద్రబాబు అయ్యారు. ఆయన నిద్రపోలేదు.. అధికారులను నిద్రపోనివ్వలేదు. ఎక్కడ ప్రజలకు అధికారుల సాయం అవసరం అనిపించిందో.. అక్కడ అధికారులు క్షణాల వ్యవధిలో చేరుకునేలా వారిని ఉరుకులు పరుగులు పెట్టించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సమన్వయం చేయడంలో ఆయన నిరంతరం అధికారులకు సూచనలూ, ఆదేశాలూ జారీ చేస్తూనే ఉన్నారు. అందుకే దటీజ్ చంద్రబాబు అంటున్నారంతా?