అత్యంత ఫలవంతంగా ముగిసిన చంద్రబాబు దావోస్ పర్యటన
posted on: Jan 23, 2026 8:52AM
.webp)
రాష్ట్రానికి రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో తన నాలుగు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్న చంద్రబాబు గురువారం (జనవరి 22)అక్కడ నుంచి బయలుదేరి శుక్రవారం (జనవరి 23) ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా అమరావతికి బయలుదేరారు.
తన దావోస్ పర్యటన అత్యంత ఫలవంతంగా సాగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం వంటి కీలక రంగాల్లో రాష్ట్రానికి రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న ప్రగతి, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను ప్రపంచ వేదికపై సమర్థంగా వివరించగలినట్లు చెప్పిన చంద్రబాబు, . గతంతో పోల్చుకుంటే ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇప్పుడు భారత్ వైపు, ఆంధ్రప్రదేశ్ వైపు ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయన్నారు.
తన పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆర్సెలర్ మిట్టల్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ వంటి 16 మందికి పైగా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. . ఇజ్రాయెల్, యూఏఈ, స్విట్జర్లాండ్ దేశాల ప్రతినిధులతోనూ సమావేశమయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 9కి పైగా సెషన్లలో పాల్గొని, ప్రపంచ పారిశ్రామిక రంగంలోని తాజా పోకడలు, నూనత ఆలోచనలు, ఆవిష్కరణలపై ప్రసంగించారు. పర్యటనలో భాగంగా యూరప్‌లోని తెలుగు ప్రజలతోనూ చంద్రబాబు మమేకమయ్యారు. తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొని వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. దావోస్ వేదికగా పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలను, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.






