తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేస్తున్నారు. అమరావతి నుంచి హెలికాప్టర్ లో బయల్దేరిన ఆయన... బాపట్ల, కృష్ణా, పల్నాడు, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇటు, మంత్రులు, అధికారులు కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాతావరణ ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అధికారులు వారిస్తున్న కూడా చంద్రబాబు ప్రజలకు అండగా ఉన్నామన్న భరోసా ఇవ్వాలంటూ ఏరియల్ సర్వే చేస్తున్నారు. 

ఇలా ఉండగా మొంథా తుపాన్ అనంతర సహాయక, పునరుద్ధరణ చర్యలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, మంత్రులతో బుధవారం (అక్టోబర్ 29) ఏరియల్  సర్వే నిర్వహించారు.  తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని, సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత నాలుగైదు రోజులుగా మొంథా తుఫాన్‌ను ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని కితాబిచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు అంతా ఒక బృందంగా పనిచేసి నష్ట నివారణకు కృషి చేశారన్నారు.  కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు తెలిపారు. మరో రెండు రోజులు ఇదే స్ఫూర్తితో పనిచేస్తే బాధితులకు మరింత ఊరట లభిస్తుందన్నారు. 

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, అధికారులు పర్యటించి, ప్రభుత్వ సహాయక చర్యల గురించి ప్రజలకు వివరించాలని, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవాలని సూచించారు. మొంథా తుపాన్‌ వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్ధం చేయాలని   ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే నష్ట తీవ్రతను చాలా వరకు తగ్గించగలిగామని సీఎం అభిప్రాయపడ్డారు.

 ఈసారి సచివాలయాలపై మైక్ అనౌన్స్‌మెంట్ సిస్టం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశాం. ఇది ఒక నూతన విధానం. మున్సిపాలిటీల్లో డ్రైన్లు శుభ్రం చేయడం వల్ల కాలనీలు ముంపునకు గురికాలేదు. దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు 10 వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచాం  అని వివరించారు. ఈ తుపాన్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మరణించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటేనే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని, మన చర్యలతో ప్రజల్లో భరోసా పెరిగిందని చంద్రబాబు అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu