ఉగ్రదాడి.. ఏపీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు ఖండించారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత, భద్రత విషయంలో  అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.   అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లిన ఆయన చంద్రమౌళి భౌతికకాయంపైపై జాతీయ జెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. 

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే విహారయాత్రకు వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడులు జరిపారన్నారు. మన రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ బి ఐ ఉద్యోగి చంద్రమౌళి, ఐటీ ఉద్యోగి మధుసూధన్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు తెలుగువారి   కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.  ఉగ్రవాదులు భారత్ ను ఏం చేయలేరు.. మన దేశంలో  సమర్థనాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉందన్నారు.  అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారత పర్యటనలో ఉండటం, దేశ ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.  

దేశ సమగ్రత, భద్రతను దెబ్బతీయాలని చూసే వారి ఆటలు సాగవు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.  జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో విశాలమైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్ర భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపిస్తాం. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తామని చెప్పారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu