క్యాసినో నుంచి కిరాణా షాపు వరకు... మద్యం దందా గుట్టురట్టు...!

posted on: Jul 28, 2026 3:17PM

 

కిరాణా దుకాణం నడుపుతూ బయటకు సాధారణ వ్యాపారిలా కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. వీకెండ్‌ పేరుతో గోవాకు విమానాల్లో వెళ్లి క్యాసినోల్లో జూదం ఆడటం.. తిరిగి వచ్చే సమయంలో గోవాలో చౌకగా లభించే నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లను భారీగా కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి విక్రయించడం.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బట్టబయలు చేసింది. పక్కా సమాచారంతో మంగళవారం తెల్లవారుజామున ఎయిర్‌పోర్టు సమీపంలోని పహాడీ షరీఫ్ వద్ద వాహనాలను తనిఖీ చేసిన ఎస్టీఎఫ్ ఏ అండ్ బీ బృందాలు, నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం అక్రమ రవాణాకు తెరదించాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 98 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోగా, వాటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. 

మద్యం తరలించేందుకు ఉపయోగించిన కారును కూడా సీజ్ చేశారు. విచారణలో బయటపడిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నానికి చెందిన కుంటిమళ్లి శ్రీనివాస్, అదే ప్రాంతానికి చెందిన పీవీవీఎస్ రామకృష్ణ తరచూ వీకెండ్‌లలో విమానంలో గోవాకు వెళ్లేవారు. అక్కడ క్యాసినోల్లో జూదం ఆడిన తర్వాత తిరుగు ప్రయాణంలో భారీ మొత్తంలో మద్యం కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చేవారు. ఆ బాటిళ్లను తమకు పరిచయం ఉన్న కిరాణా దుకాణం కస్టమర్లకు, ఫంక్షన్లు నిర్వహించే వారికి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా లాభాలు ఆర్జిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

తనిఖీల సమయంలో నిందితుల కారులో 42 మద్యం బాటిళ్లు లభించగా, మిగిలిన తనిఖీల్లో మరో 56 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 98 బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లతో పాటు సీజ్ చేసిన కారును శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఎస్టీఎఫ్ టీమ్ లీడర్లు విష్ణుమూర్తి, ఫయాజోద్దీన్ తెలిపారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో ఎస్టీఎఫ్ ఏ అండ్ బీ టీమ్‌ల సీఐలు ఎంపీఆర్ చంద్రశేఖర్, బిక్షారెడ్డి, ఎస్సైలు సాయి కిరణ్ రెడ్డి, భరత్, బాలరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు

Casino, Gova, STF, Ibrahimpatnam, Non-duty paid alcohol, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand

google-ad-img
    Related Sigment News
    • Loading...