తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై సీఐడీ కేసు

posted on: May 30, 2026 12:42PM

 

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మైనింగ్ తవ్వకాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం నిర్వహించిన విచారణలో ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. విజిలెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా మైనింగ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు మైనింగ్ అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

గత ప్రభుత్వ హయాంలో వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఖనిజ తవ్వకాల అనుమతులు, లీజుల మంజూరు, తవ్వకాల పరిమితులు, ఖనిజాల రవాణా, రాయల్టీ చెల్లింపులు తదితర అంశాలపై దర్యాప్తు జరపనున్నారు. విజిలెన్స్ అధికారుల విచారణలో ఇంత భారీ ఎత్తున అక్రమాలు బయట పడడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై వెంటనే పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని సీఐడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు ఇప్పటికే సంబంధిత శాఖల నుంచి రికార్డులు, అనుమతి పత్రాలు, లీజు ఒప్పందాలు, తనిఖీ నివేదికలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

అవసరమైతే అప్పటి అధికారులు, మైనింగ్ కంపెనీల ప్రతినిధులు, ఇతర బాధ్యులను విచారించే అవకాశముంది. అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మైనింగ్ అక్రమాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సీఐడీ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముండటంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...