Latest News
కమలంతో కారు ప్రయాణం?.. వచ్చే ఎన్నికల నాటికి పొత్తుపొడుపు!?
posted on: Mar 25, 2026 3:13PM

బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తప్పేంటి? ఒక మీడియా చిట్ చాట్ లో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న మాటిది. ఒక కాలు బాగా లేనపుడు మరొకరి సాయం తీసుకోవడం ఎంత సహజమో ఇదీ అంతే అంటూ తెలంగాణ రాజకీయాలలో కొత్త చర్చకు తెరలేపారాయన. అయితే ఇది కేవలం రాకేష్ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయమా? పార్టీ అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంటే.. బీఆర్ఎస్, బీజేపీల దోస్తీ గురించి ఇప్పుడే కాదు.. చాలా రోజుల నుంచి ఎడతెగని చర్చ నడుస్తూనే ఉంది. నడుస్తూనే ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అంటూ కాంగ్రెస్ గత చాలా కాలంగా చెబుతూ వస్తున్నది.
గత ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకుంటే ఈ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్నట్టేనని జనం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ కామెంట్ ఎంతగా పని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న.. బీజేపీని థర్డ్ ప్లేస్ లో పడేసింది. చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంది బీజేపీ. ఇక లోక్ సభ ఎన్నికల నాటికి పుంజుకుని 8 ఎంపీలను కైవసం చేసుకుని పర్లేదనిపించుకుంది. దీనిపైనా కాంగ్రెస్ కామెంట్లు చేసేది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీతో చేసుకున్న లోపాయికారి ఒప్పందం వల్లే ఇన్ని సీట్లు బీజేపీకి వచ్చాయని విమర్శలు గుప్పించింది.
అంటే బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఆన్ బీజేపీ అన్నది గత కొంతకాలంగా.. రాష్ట్రంలో ఒక ప్రత్యేక అధ్యాయం నడుస్తూనే ఉందన్నమాట. ఇప్పటి వరకూ పైపై మాటలకే పరిమితమైన ఈ ధోరణి.. రేపటి రోజున నిజమైనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ బలం గట్టిగా 45 సీట్లు కూడా దాటలేదు. తెలంగాణలో అధికారం చేపట్టడానికి మినిమం 60 ఉండాలి. దీంతో ఈ రెండు పార్టీలు ఇప్పటికీ అలాగే ప్రతిపక్షంలో ఉంటూ వస్తున్నాయి.
ఒక వేళ వచ్చే ఎన్నికల్లో.. రెండు పార్టీలూ కూటమి కడితే.. అది సత్ఫలితాలను ఎందుకివ్వదనే ఈక్వేషన్లు ఇప్పుడు గట్టిగా చర్చలోకి వస్తున్నాయి. మాములుగా అయితే ఇక్కడ బీజేపీ.. టీడీపీ, జనసేనతో జట్టు కట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ టీడీపీ.. రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహం కొద్దీ కాంగ్రెస్ ని ఒక ఫ్రెండ్లీ టీం గానే భావిస్తోంది. దీంతో గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మాత్రమే పొత్తు పెట్టుకున్నాయి.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోతే.. జనసేన పరిస్థితి ఏంటి? అన్నది కూడా ఇక్కడ చర్చనీయాంశమే. తెలంగాణ ఏర్పడ్డాక 2014, 18, 23 ఎన్నికల్లో.. దాదాపు ఒంటరిగా పోటీ చేసిన బీఆర్ఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? ఆ పార్టీకి అసలు పొత్తు అలవాటు ఉందా? అంటే ఉద్యమ పార్టీగా ఉన్నపుడైతే ఎందరితోనో కారు పార్టీ పొత్తులు పెట్టుకున్న పరిస్థితులున్నాయి.
2004లో యూపీఏతో, 2009లో టీడీపీ, సీపీఐ, సీపీఎంతో మహా కూటమి కట్టింది. ఇక 2024 లోక్ సభ ఎన్నికల సమయంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లు ఏనుగు పార్టీకి కేటాయించింది. పార్టీ ఆవిర్భావం నుంచి వివిధ దశల్లో వామపక్షాలతో అవగాహన ఉండటం వంటివి జరుగుతూనే వచ్చాయి. ఆయా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా.. పొత్తులు పెట్టుకోవడం, విడిపోవడం చేస్తూనే వచ్చింది నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్. కాబట్టి ఇప్పుడు బీజేపీతో పొత్తు అనే అంశమేమీ కొత్తది కాదు. బీజేపీ కూడా ఇక్కడ ఎలాగైనా సరే అధికారంలో పాల్పంచుకోవాలంటే బీఆర్ఎస్ తో పొత్తు విషయంలో వెనక్కు తగ్గక పోవచ్చు కూడా.
దానికి తోడు ఢిల్లీ లిక్కర్ కేసులో.. కవిత ఎలాంటి తప్పు చేయలేదంటూ వచ్చిన తీర్పు సైతం ఇందులో భాగమేనా అన్న అనుమానాలున్నాయి. వీటన్నిటినీ బట్టి చూస్తుంటే 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలసి నడిచేలా కనిపిస్తోంది. ఇప్పటికే మున్సిపాల్టీల్లో చాలా చోట్ల కలిసినట్టు కనిపిస్తోన్న ఈ రెండు పార్టీలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తు పెట్టుకుని పోటీకి దిగేలా తెలుస్తోంది.
నగరాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ కి ఎలాగూ గట్టి పట్టే ఉంది. ఇక ఉత్తర తెలంగాణ, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ మరింత పట్టు సాధించగలిగితే.. ఈ పొత్తు కూడా వర్కవుట్ అయ్యేలా కొడుతోంది. కాబట్టి ఈ పొత్తు ముందు ముందు రోజుల్లో పొడిచేలాగానే కనిపిస్తోందంటారు పలువురు రాజకీయ విశ్లేషకులు.


.webp)



