ఆ నది రూటు మార్చింది..

 

మానవజాతి పుట్టుక, అభివృద్ధి అంతా నదుల దగ్గరే జరిగింది అని చరిత్ర చెబుతుంది. ఎరిడినాస్, ఇల్లిసాస్ నదుల తీరాన గ్రీకు నాగరికత, సింధునది ఒడ్డున హరప్పా మొహంజోదారో సంస్కృతి ఇలా చెప్పుకుంటూ పోతే నదులే నాగరికతకు జీవనాడులు. తమ గలగలలతో ఉన్న చోటును సస్యశ్యామలం చేస్తూ మనిషికి దాహాన్ని, ఆకలిని తీరుస్తున్నాయి నదులు. అలాంటి నదులకు తన చేతులారా కోపం వచ్చేలా చేస్తున్నాడు మనిషి. స్వార్థంతో వాతావరణాన్ని కలుషితం చేస్తూ తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నాడు. వాతావరణ కాలుష్యంతో భూతాపం విపరీతంగా పెరిగిపోయి మంచు వేగంగా కరిగితే పెను విధ్వంసం జరుగుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నదులు తమ ప్రవాహ దిశను మార్చుకునే అవకాశం ఉందని వారు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు వారి భయం నిజమైంది. వాయువ్య కెనడాలోని ఓ హిమానీనదం గతేడాది ఒక్కసారిగా రూటు మార్చింది. ఆ నది ప్రవాహం గతంలో బేరింగ్ సముద్రంలో కలిసేది..కానీ గతేడాది నుంచి ఆ హిమానీనదం పసిఫిక్ మహాసముద్రం దిశగా పరుగులు తీయడం ప్రారంభించింది. భూతాపమే దీనికి కారణమని వాషింగ్టన్ యూనివర్శిటీ నిపుణులు గుర్తించారు. మంచు దిబ్బల చివరి ప్రాంతంలో ఏర్పడిన భారీ లోయ వల్లే ఇలా జరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. జరుగుతున్న ధ్వంసం చూస్తుంటే ప్రపంచంలోని మరిన్ని నదులు ఇలాగే దిశ మార్చుకునే ప్రమాదం పొంచి ఉంది. నదులు తాము ప్రవహించే ప్రాంతం నుంచి రూటు మార్చితే ఇంకేమైనా ఉందా...?  జరిగే నష్టం ఊహకు కూడా అందదు. ఇకనైనా మనిషి ప్రకృతి గురించి కాస్త ఆలోచిస్తే మంచిది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu