Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కెనడా ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు.. భారతీయులకు అక్కడ శాశ్వత నివాసం ఇక కలేనా?
posted on: Apr 22, 2026 11:15AM
.webp)
కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాలు.. అక్కడి విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కెనడా పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్ C-12 ద్వారా పౌరసత్వ, నివాస నిబంధనలను ట్రూడో సర్కారు సమూలంగా మార్చేసింది. ఈ కొత్త నిబంధనల వల్ల సరైన అర్హతలు లేని వారు, నిబంధనలు ఉల్లంఘించిన వారు దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. అక్కడ నివసిస్తున్న దాదాపు 30 వేల మందికి పైగా ఇండియన్స్ ఈ చట్టం పరిధిలోకి రానున్నట్లు అంచనా.
గత కొన్ని దశాబ్దాలుగా కెనడా విదేశీయులకు స్వర్గధామంగా నిలిచింది. అయితే, ఇటీవల కాలంలో పెరుగుతున్న జనాభా, గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడి దృష్ట్యా కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేస్తోంది. తాజాగా తీసుకువచ్చిన బిల్ ప్రధానంగా కెనడా పౌరసత్వం పొందే ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు.. అనర్హులను ఏరివేసేందుకు ఉద్దేశించినదని చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం.. తప్పుడు సమాచారంతో వీసాలు పొందిన వారు, అలాగే.. గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశాలు దఖలుపడతాయి.
ఈ పరిణామం కెనడాలో స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది ఇండియన్స్ పై మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే స్టడీ పర్మిట్లపై ఆంక్షలు విధించిన కెనడా.. ఇప్పుడు శాశ్వత నివాస హోదా కల్పించే విషయంలో కూడా కోత విధించాలని నిర్ణయించింది. బిల్ సి 12 అమలుతో పౌరసత్వ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా, చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలు జరిగినా వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులకు దారితీస్తుంది.
ముఖ్యంగా రాజకీయ ఆశ్రయం కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారిపై ఈ చట్టం ప్రభావం తీవ్రంగా ఉంది. కెనడాకు వచ్చిన ఏడాది లోపు ఆశ్రయం కోరని పక్షంలో వారి దరఖాస్తులను తిరస్కరించే వెసులుబాటును ఈ చట్టం కల్పించింది. నిజానికి, కెనడాలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగ సమస్య ఈ కఠిన నిర్ణయాలకు కారణమని తెలుస్తోంది. స్థానిక కెనడియన్లలో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వలసదారుల సంఖ్యను తగ్గించాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే తాత్కాలిక నివాసితుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు, ఈ చట్టం పట్ల మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా కెనడా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన వలసదారులను అకస్మాత్తుగా వెనక్కి పంపడం వల్ల కార్మికుల కొరత ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అక్కడి హోటల్ మేనేజ్‌మెంట్,అగ్రికల్చర్ రంగాల్లో భారతీయుల పాత్ర కీలకం. అయితే.. జాతీయ భద్రత మరియు ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా ఈ మార్పులు తప్పవని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది.
భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే, చాలా మంది విద్యార్థులు భారీగా అప్పులు చేసి కెనడాకు వెళ్తుంటారు. అక్కడ చదువు పూర్తి చేసిన తర్వాత శాస్వత నివాసం పొంది స్థిరపడాలనేది వారి ప్రధాన లక్ష్యం. కానీ.. మారుతున్న నిబంధనలు వారి భవితపై ఆందోళనకు కారణమౌతున్నాయి. బిల్ సి 12ను కఠినంగా అమలు చేస్తే.. వేలాది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి.






