రిషికొండ ప్యాలెస్.. కేబినెట్ సబ్ కమిటీ ఏమంటోందంటే?

posted on: Apr 7, 2026 3:03PM

జగన్ హయాంలో వందల కోట్ల ప్రజాధనాన్నివ్యయం చేసి నిర్మించిన అత్యంత విలాలవంతమైన, అంతకు మించి వివాదాస్పదమైన రిషికొండ ప్యాలెస్ వినియోగంపై ఉత్కంఠకు తెరపడిందా? ఈ విలాసవంతమైన భవనాన్ని ప్రస్తత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగించనుందా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. జగన్ హయాంలో నిబంధనలను తుంగలోకి తొక్కి, పర్యావరణ సమతుల్యతకు భగం వాటిల్లేలా పచ్చటి రుషికొండకు బోడి గుండు కొట్టి మరీ నిర్మించిన ఈ విలాలవంతమైన భవనాన్ని ఎలా వినియోగించుకోవాలన్న విషయంపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ సబ్ కమిటీ తాజాగా భేటీ అయ్యింది.

ఈ భేటీలో విశాఖపట్నంలోని వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను కేవలం ఎగ్జిబిషన్ లా కాకుండా,  ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే విధంగా తీర్చిదిద్దాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. జగన్ హయాంలో రూ. 400 కోట్లకు పైగా  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరీ ఈ ప్యాలెస్ ను నిర్మించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఈ రుషికొండ ప్యాలెస్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి భారంగా మారింది.  గతంలో ఇక్కడ ఉన్న పర్యాటక శాఖ రిసార్ట్స్ ద్వారా ప్రభఉత్వానికి  7 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. కానీ వాటిని కూల్చివేసి ఈ ప్యాలెస్‌ను నిర్మించడంతో ఆ ఆదాయం లేకుండా పోవడమే కాకుండా.. రుషికొండ ప్యాలెస్ నిర్వహణ వ్యయమే నెలకు పాతిక లక్షల రూపాయలకు పెగా ఉంది.  

ఈ ఆర్థిక భారాన్ని తగ్గించి రిషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ హోటల్ చైన్స్‌కు అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది.   తాజ్ గ్రూప్, లీలా ప్యాలెస్ వంటి దిగ్గజ సంస్థలుఈ దిశగా  ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిని లగ్జరీ హోటళ్లుగా లేదా ప్రపంచస్థాయి రిసార్ట్స్‌గా మార్చడం ద్వారా అటు పర్యాటకాన్ని అభివృద్ధితో పాటు, ప్రభుత్వానికీ  భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని కమిటీ  ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

తాజా భేటీలో కమిటీ చర్చించిన విషయాలపై సమగ్ర నివేదిక రూపొందించి దానిని ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరలో సమర్పించాలని కమిటీ భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  ఆ నివేదికపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...