రేవంత్ హస్తిన బాట.. డీసీసీ చీఫ్ ల ఎంపికతో పాటు.. కేబినెట్ రీషఫుల్ కూడా?
posted on Oct 25, 2025 4:16PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకూ ఆయన కేబినెట్ పునర్వ్యవస్థీకరణకూ లింక్ ఉందా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి ఔననే సమాధానమే వస్తున్నది. రేవంత్ రెడ్డి శనివారం (అక్టోబర్ 25) హస్తినకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన హస్తిన పర్యటనకు ప్రధాన కారణం పార్టీ జిల్లా అధ్యక్షుల ఖరారు కోసమే అయినప్పటికీ.. పనిలో పనిగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా పార్టీ హైకమాండ్ తో చర్చించి ఓకే చేయించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అధికారిక సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ జిల్లాల అధ్యక్షులను నియమించే విషయంలో సీరియస్ గా ఉంది. అందుకోసమే శనివారం (అక్టోబర్ 25) ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కూడా వెళ్లారు.
అది పక్కన పెడితే.. తెలంగాణలో మంత్రుల మధ్య జరుగుతున్న అంతర్గత పోరుపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఆ అసంతృప్తిని పార్టీ అధిష్ఠానం ఏమీ గోప్యంగా ఉంచలేదు కూడా. పద్ధతి మార్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షీ నటరాజన్ పలు మార్లు మంత్రులను హెచ్చరించారు కూడా. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా కాలంగా మంత్రివర్గంలో మార్పులూ చేర్పుల కోసం హైకమాండ్ ను కోరుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి సీఎం రేవంత్ హస్తిన పర్యటన సందర్భంగా తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కీలక చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మేడారం జాతర పనుల విషయంలో రేగిన రగడ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసిందని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే అంతకు ముందు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ల వివాదంపై కూడా హైకమాండ్ అసంతృప్తితో ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే డీసీసీ చీఫ్ ల ఎంపికతో పాటు.. మంత్రివర్గ పునర్వ్యవ స్థీకరణపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.