క్యాబ్ డ్రైవర్.. నెల సంపాదన రూ. 1.2లక్షలు!

posted on: Mar 20, 2026 11:01AM

పని చిన్నదా పెద్దదా అని కాకుండా పట్టుదలతో, చిత్తశుద్ధితో ముందుకు సాగితే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని నిరూపించాడు యూపీకి చెందిన హజ్రత్ అనే యువకుడు.  సాధారణ బైక్ మెకానిక్‌ అయిన హజ్రత్.. ఇప్పుడు   ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ 'ఉబెర్'లో అత్యధిక ఆదాయం పొందే డ్రైవర్లలో ఒకరిగా నిలిచాడు. ఏదైనా కొత్త పని ప్రారంభించేటప్పుడు అది తాను చేయగలనా? లేనా? అన్న సందేహాలతో వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగాలనీ, ఆ ధైర్యమే తనను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందని అంటారు హజ్రత్. 

హజ్రత్ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయినా..  బైక్ మెకానిక్‌గా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో.. మరింత మెరుగైన   ఉపాధిని వెతుక్కుంటూ ఢిల్లీకి వలస వచ్చారు. అక్కడ ఒక గార్మెంట్ తయారీ కంపెనీలో దాదాపు మూడేళ్ల పాటు పని చేశారు.  పిల్లలు ఎదుగుతున్న క్రమంలో పెరుగుతున్న ఖర్చులకు ఆ జీతం ఏ మూలకూ సరిపోకపోవడంతో  ఒక మిత్రుడు ఇచ్చిన సలహా  మేరకు క్యాబ్ డ్రైవర్ గా ఉబెర్ లో చేరారు. అలా చేరిన కొత్తలో  స్మార్ట్‌ఫోన్ వాడటం, యాప్ ద్వారా రైడ్స్ స్వీకరించడం వంటి సాంకేతిక విషయాల విషయంలో ఒకింత ఇబ్బంది పడ్డారు.

అయితే పట్టుదలతో వాటన్నిటినీ అధిగమించారు. శ్రమను నమ్ముకున్నారు. రోజుకు 14 గంటలు శ్రమించారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఈ విషయాన్ని ఉబెర్ సంస్థ ఇటీవల ప్రకటించింది. హజ్రత్ అంకిత భావాన్ని ప్రశంసించింది. 

హజ్రత్ ఇప్పటివరకు ఏకంగా 50 వేల ట్రిప్పులను విజయవంతంగా పూర్తి చేశారనీ..  ఒక నెలలో అత్యధికంగా రూ. 1.2 లక్షల వరకు సంపాదించారని ఉబెర్ వెల్లడించింది.  ఒక సాధారణ డ్రైవర్  ఇంతటి భారీ ఆదాయం పొందే స్థాయికి ఎదగడం వెనుక ఆయన అలుపెరగని శ్రమ దాగి ఉందనడంలో సందేహం లేదు. కాగా హజ్రత్  తన వృత్తి పట్ల చూపుతున్న గౌరవం, అంకితభావం, క్రమశిక్షణే ఆయనను ఈ స్థాయికి చేర్చాయంటూ నెటిజనులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.  ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే..  అసాధారణ విజయాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయనడానికి హజ్రత్ ఒక ఉదాహరణగా నిలుస్తారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...