ముఖ్యమంత్రికి రక్తలేఖ..!

posted on: Aug 12, 2016 6:45PM

ఏదైనా సమస్య వచ్చినా..కష్టమొచ్చినా కిందిస్థాయిలో అధికారుల వద్దకే వెళతారు జనం. అయితే అక్కడ ఎలాంటి న్యాయం జరగని పక్షంలో ఏకంగా ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రికే తమ గోడు వెళ్లబోసుకుని సమస్యల నుంచి బయటపడుతుంటారు. అలా న్యాయం జరగని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక 15 ఏళ్ల బాలిక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌కు ఉత్తరం రాసింది. అది కూడా రక్తంతో. బులంద్ షహర్ పట్టణానికి చెందిన ఓ వివాహితకు ఇద్దరు కుమార్తెలు. మగ సంతానానికి జన్మనివ్వలేదనే కారణంతో తమ కళ్లెదుటే తన తల్లిని సజీవదహనం చేశారని పెద్ద కుమార్తె లేఖలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. ఆ లేఖ సారాంశం ఇదే..


బేటీ బచావో..బేటీ పడావో అని చెబుతారు..మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఓ మహిళ మరో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందనే కారణంతో ఆమెకు నిప్పంటించారు. మమ్మల్ని కూడా చంపేస్తామని బెదిరిస్తున్నారు. కష్టంలో సాయం చేయాల్సిన పోలీసులు పట్టించుకోలేదు, పైగా అమ్మను చంపిన దుర్మార్గులను రక్షిస్తున్నారు. నన్ను, నా చెల్లెని గదిలో బంధించి మా నాన్న, ఇతర కుటుంబసభ్యులు కలిసి అమ్మకు నిప్పంటించారు అని లేఖలో పేర్కొంది. అయితే ఇదే అమ్మాయి, ఇదే విషయంపై గత నెలలో ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాసినా ఆయన నుంచి స్పందన రాలేదు. దీంతో రక్తంతో రాస్తేనైనా తన పరిస్థితిని సీఎం అర్థం చేసుకుని న్యాయం చేస్తారనే ఉద్దేశ్యంతో మరోసారి లేఖ రాసినట్లు సదరు బాలిక మీడియాకు తెలిపింది. మొదట ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఈ ఉత్తరాన్ని అనంతరం ఫ్యాక్స్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...